Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !

ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 12:00 AM IST

ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. వైజాగ్ ఏజెన్సీ, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాల్లోని గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారని. వీరికి మద్దతుగా మావోయిస్టులు ఉన్నారన్నారు. మావోయిస్టులకు గంజాయి సాగు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని ఆయన ఆరోపించారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులతో పాటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన అంతర్ రాష్ట్ర సమన్వయ సమావేశానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరైయ్యారు. గంజాయి స్మగ్లర్ల నుంచి మావోయిస్టులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.AOBలోని కొండ ప్రాంతాలలో గంజాయి సాగు చాలా ఎక్కువగా ఉందని…అందుకే మావోయిస్టులు ఈ వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారన్నారు. గంజాయి సాగు,అక్రమ రవాణాని నియంత్రించడానికి పోలీస్ శాఖ కష్టపడుతుందని… ఇతర రాష్ట్రాల పోలీసులు,ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయం గంజాయి రవాణా నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.గంజాయి వల్ల కలిగే ముప్పు, గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించామని డీజీపీ సవాంగ్ తెలిపారు.

గంజాయి సాగుతో పోలీసులే బాగుపడ్డారు – మావోయిస్టులు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలపై మావోయిస్ట్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.గంజాయి సాగుపై పోలీసుల తీరును ఎండగడుతూ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. డీజీపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గంజాయి వల్ల షావుకార్లు,దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడ్డారని పేర్కొన్నారు.గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారని గణేష్ ఆరోపించారు. దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో గంజాయి సాగు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు,సివేరి సోమల మృతి తరువాత దుంబ్రి గూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడానికి ఇదే కారణమని ఆరోపించారు. గంజాయి సాగు విషయంలో సీఐ, సీఐల నుంచి పై అధికారుల వరకూ బాగుపడుతున్నారని చెప్పారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఉద్దేశంతో పరివర్తన పేరిట ఆదివాసి గ్రామాలపై పోలీసుల దాడులను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.