Maoist Leader Devakka : నెల్లూరు పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు మ‌హిళా నేత‌

నెల్లూరు పోలీసుల ముందు మావోయిస్టు మ‌హిళా నేత దేవ‌క్క లొంగిపోయారు

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 08:46 AM IST

నెల్లూరు పోలీసుల ముందు మావోయిస్టు మ‌హిళా నేత దేవ‌క్క లొంగిపోయారు. తూర్పుగోదావరి డివిజన్‌లో పలు కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళా మావోయిస్టు నేత నెల్లూరు జిల్లా పోలీసులకు లొంగిపోయింది. ఆమెను సీపీఐ(మావోయిస్ట్)కు చెందిన శ్రీరామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాస్ లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌లో ప్రకటించిన అన్ని ప్రయోజనాలను డిపార్ట్‌మెంట్ అందజేస్తుందని.. రాజేశ్వరికి రూ.4 లక్షల రివార్డు అందజేస్తామని ఎస్పీ సిహెచ్ విజయరావు తెలిపారు.

దేవక్క గతంలో తూర్పుగోదావరి జిల్లా డివిజన్‌లోని ఎల్లవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా ప‌ని చేసింది. ఆమెపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన దేవక్క నెల్లూరు జిల్లా కావలి మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీ రామోజు నరేంద్ర అలియాస్ సుబ్బన్నను వివాహం చేసుకుంది. రాడికల్ స్టూడెంట్స్ లీగ్ (ఆర్‌ఎస్‌ఎల్), రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్) కార్యకలాపాలలో సుబ్బన్న చురుకుగా పాల్గొన్నారు. సీపీఐ (మావోయిస్ట్) కార్యకలాపాల్లో చేరడానికి ముందు దంపతులు తమ ఇద్దరు కుమారులను గుంటూరు జిల్లాలో ఉన్న హాస్టల్‌లో విడిచిపెట్టారు. ఆమె తన భర్త శ్రీ రామోజు నరేంద్రతో కలిసి 1984లో CPI-ML పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరారు. ప్రారంభ రోజుల్లో రాజమండ్రి, విశాఖపట్నం జిల్లాల్లో డెన్ కీపర్‌గా పనిచేశారు. దేవక్క మావోయిస్టు గ్రూపులోని సీనియర్ సభ్యులకు ఆశ్రయం కల్పించి సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు పార్టీ నాయకులకు వైద్యసహాయం అందించారు. ఆమె నాలుగేళ్లకు పైగా డెన్ నిర్వహించి ఎస్ కేశవరావు అలియాస్ గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నిమ్మలూరి భాస్కర్ అలియాస్ మల్లిక్, నల్లా ఆదిరెడ్డి అలియాస్ రఘు, వి చంద్రమౌళి వంటి సీనియర్ కేడర్‌లకు ఆశ్రయం కల్పించింది.

1987లో ఐదుగురు మావోయిస్టులతో పాటు ఆయుధాలు కలిగి ఉన్న ఆమెను, నరేంద్రను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. వారిని రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించారు. దీనికి ప్రతీకారంగా 1987 నవంబర్ 27న తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేతలు 8 మంది ఐఏఎస్ అధికారుల బృందాన్ని అపహరించి తమ పార్టీ క్యాడర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. దేవక్క, నరేంద్ర సహా ఏడుగురు మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి అటవీ ప్రాంతానికి పంపింది. తర్వాత తూర్పుగోదావరి డీవీసీ, ఎల్లవరం దళంలో నరేంద్ర, దేవక్కలు పనిచేయడం ప్రారంభించారు. దేవక్కపై రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు ప్రకటించింది. 2018లో భర్త చనిపోవడంతో పోలీసుల ఎదుట లొంగిపోవాలని దేవ‌క్క నిర్ణయించుకుంది.