స్మగ్లర్ల గుప్పిట్లో మన్యం ప్రాంతాలు.. గంజాయి దందాలో గిరి‘జనం’

వాళ్లంతా అమాయక గిరిజన యువకులు.. పొట్ట కూటి కోసం అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తుంటారు. పాపం, పుణ్యం తెలియని గిరిజన యువకులపై స్మగర్ల కన్ను పడింది.

  • Written By:
  • Publish Date - October 19, 2021 / 08:45 PM IST

వాళ్లంతా అమాయక గిరిజన యువకులు.. పొట్ట కూటి కోసం అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తుంటారు. పాపం, పుణ్యం తెలియని గిరిజన యువకులపై స్మగర్ల కన్ను పడింది. డబ్బును ఎరగా వేస్తూ, భయపెడుతూ గంజాయి దందాలోకి గుట్టుగా దింపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గిరిజన యువకులతో గంజాయి సప్లయ్ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్మగ్లర్లు మాత్రం ఆర్థికంగా లాభపడుతూ, గిరిజన యువకులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) సైతం అవునని చెప్తుంది. రాష్ట్రంలో చాలా మంది గిరిజన యువకులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని తేల్చి చెప్పింది.

తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద, పెద్ద స్మగ్లర్లు స్థానిక గంజాయి సాగుదారులతో పరిచయాలు ఏర్పర్చుకుంటున్నారు. గంజాయిను రవాణా చేసేందుకు గిరిజన యువకులను వాడుకుంటున్నారు. పోలీసులు, అధికారులు జరుపుతున్న దాడుల్లో అమాయక గిరిజన యువకులు పట్టుబడుతున్నారు. చేసేదేం లేక జైలు జీవితం గడుపుతున్నారు. ఏపీలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత 2. 150 కోట్లకు పైగా విలువైన 2.70 లక్షల కేజీల గంజాయిని స్వాధీనమైంది. స్మగ్లర్లు గిరిజన ప్రజలు, యువకులు, విద్యార్థులకు కొంతమొత్తం చెల్లించి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయిస్తున్నట్టు స్పష్టమైంది. ఈ వ్యవహరంలో గంజాయి స్మగ్లర్లపై 2,039 లక్షల కేసులు నమోదు కాగా, 5,411 మందిని అరెస్టు చేశారు. 1,404 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వాళ్లలో గిరిజన యువకులే కాకుండా, మహిళలు కూడా ఉన్నారు.

ఏపీలో ఏజెన్సీ ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారడం, తరచుగా గిరిజన యువకులు పట్టుబడుతుండటంతో విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులతో జాయింట్ ఆపరేషన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు రైడింగ్ చేస్తూ అక్కమార్కులను అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వ రైల్వే పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అలర్ట్ అవుతూ గంజాయి దందాను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి విరివిగా దొరుకుతుండటంతో ఎంతోమంది యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతున్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచుతున్నారు. ఇప్పటివరకు వందకుమందిపైగా విద్యార్థులను పట్టుకున్నట్లు, వాళ్లందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఎస్పీ తెలిపారు.