Site icon HashtagU Telugu

Manchu Vishnu : చిరు,జ‌గ‌న్ భేటీపై ‘మంచు’ బాంబ్

Manchu Chiru Jagan

Manchu Chiru Jagan

మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీపై మా అధ్య‌క్షుడు మంచు విష్ణు బాంబ్ పేల్చాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన భేటీని వ్య‌క్తిగ‌తమైన‌ది తేల్చేశాడు. చాలా రోజుల త‌రువాత సినిమా టిక్కెట్ ధరలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని కలవడం వ్యక్తిగతమని, `మా` అసోసియేష‌న్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్ప‌డంతో టాలీవుడ్ లో క‌ల‌క‌లం బ‌య‌లుదేరింది. అప్ప‌ట్లో జ‌రిగిన రాజ‌కీయ ఎంట్రీ ప్ర‌వేశానికి మంచు విష్ణు తాజాగా చేసిన కామెంట్లు బ‌లం చేకూర్చుతోంది.సంక్రాంతి పండుగ రోజున మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేక విమానంలో వెళ్లి సీఎం జ‌గ‌న్ తో భేటీ అయిన విష‌యం విదిత‌మే. ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌తీమ‌ణి పెట్టిన విందు బాగుంద‌ని ప్ర‌త్యేకంగా చిరు కితాబు ఇచ్చాడు. సినిమా టిక్కెట్లు, ఆన్ లైన్ విధానం గురించి ప్ర‌స్తావించడానికి భేటీ అయ్యాన‌ని ఆ రోజున చిరంజీవి చెప్పాడు. రెండు, మూడు వారాల్లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి గుడ్ న్యూస్ టాలీవుడ్ కు వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్త‌ప‌రిచాడు. ఆలోపుగా ఎవ‌రూ టిక్కెట్ల ధ‌ర‌లు, ఆన్ లైన్ విధానం మాట్లాడొద్ద‌ని రిక్వెస్ట్ చేశాడు. కానీ, వాళ్లిద్ద‌రి భేటీ వెనుక ఏదో రాజ‌కీయ కోణం ఉంద‌ని మీడియా కోడైకూసింది. దాన్ని చిరు వైపు నుంచి ఎవ‌రూ పెద్ద‌గా ఖండించ‌లేదు.
YouTube video player

టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానంపై చాలా కాలం స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌భుత్వాల‌పై పోరాటం చేశాడు. ఆయ‌న శిష్యుడిగా మోహ‌న్‌బాబు కూడా తాజాగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స్పందించ‌లేదు. పైగా మా అధ్య‌క్షుడిగా ఉన్న మంచు విష్ణు కూడా మౌనంగా ఉండిపోయాడు. కేవలం సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌, చిరంజీవి మాత్ర‌మే ప్రభుత్వంతో టాచ్ లోకి వెళ్లారు. ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు హైకోర్టులో పిటిష‌న్ వేసి న్యాయం పోరాటం చేస్తున్నారు. కోర్టు డైరెక్ష‌న్ మేర‌కు ప్ర‌త్యేక క‌మిటీని ఏపీ ప్ర‌భుత్వం నియ‌మించింది. ఆ క‌మిటీ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లు విభాగాల ప్ర‌ముఖుల‌తో భేటీ అయింది. రేపోమాపో టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తుంద‌ని భావిస్తోన్న స‌మ‌యంలో మంచు విష్ణు తెర‌మీద‌కు వ‌చ్చాడు. సంక్రాంతి సంద‌ర్భంగా చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ తో జ‌రిగిన స‌మావేశం పూర్తిగా వ్యక్తిగ‌త‌మైన‌ద‌ని సంచ‌ల‌న కామెంట్ చేశాడు.వాస్త‌వంగా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌, ఆన్ లైన్ విధానంపై చిరంజీవి, నాగార్జున‌,ద‌గ్గుబాటిసురేష్‌, రాజ‌మౌళి త‌దిత‌రులు ఏపీ సీఎం జ‌గ‌న్ ను తొలిసారి క‌లిసిన‌ప్పుడు ప్ర‌స్తావించారు. ఆ మేర‌కు రాత‌పూర్వ‌క విన‌తిని కూడా అందించార‌ని మంత్రి పేర్నినాని చెప్పిన విష‌యం అందరికీ తెలిసిందే. వాళ్లిచ్చిన విన‌తిని అధ్య‌య‌నం చేసిన త‌రువాత ఏపీ స‌ర్కార్ జీవోను విడుద‌ల చేసింది. దానిపైన ప‌వ‌న్ తొలిసారి రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో స్పందించాడు. సామాజిక కోణాన్ని రంగ‌రిస్తూ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపడంతో త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నాం. ఇప్పుడు తాజాగా మా అధ్య‌క్షుని మాట‌ల‌తో చిరంజీవి, జ‌గ‌న్ భేటీ రాజ‌కీయ కోణాన్ని సంత‌రించుకుంది. సో..మీడియా తొలి నుంచి అనుమానిస్తున్న‌ట్టే చిరంజీవి రాజ‌కీయ రీ ఎంట్రీ వైసీపీ రూపంలో ఉండ‌బోతుంద‌ని `మెగా ` కోట‌రీలోని టాక్‌. కానీ, చిరంజీవి మాత్రం ప‌లుమార్లు రాజకీయాల‌కు దూరం అంటూ ఖండించాడు. ఇదే త‌ర‌హాలో ఖండ‌న‌లు ప్ర‌జారాజ్యం విలీన స‌మ‌యంలో కూడా ఉండేవి. అందుకే, ఇప్పుడు చిరంజీవి ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తున్న‌ప్ప‌టికీ..వైసీపీలోకి ఎంట్రీ అంటూ ప్ర‌చారం మ‌ళ్లీ మంచు పేల్చిన బాంబ్ తో ఊపందుకుంది.