Site icon HashtagU Telugu

Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మ‌రూపంలో చూసుకుంటూ..

wax statue

wax statue

త‌నతో ఏడు అడుగులు న‌డిచిన త‌న భార్య అకాల మ‌ర‌ణం చెంద‌డంతో విజ‌య‌వాడ‌కు చెందిన వ్యాపార‌వేత్త మండ‌వ కుటుంబరావు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైయ్యారు.దీనిని గ‌మ‌నించిన ఆయ‌న కుమార్తె స‌స్య త‌న తండ్రికి అత్యంత విలువైన బ‌హుమ‌తి ఇచ్చింది. గత సంవత్సరం నవంబర్ 13 రాత్రి తన ఇంటి వద్దకు వచ్చిన అరుదైనబ‌హుమ‌తిని చూసి కుటుంబ‌రావు ఆశ్చ‌ర్యానికి గురైయ్యారు. ఇంత‌కీ ఆ బ‌హుమ‌తి ఎంట‌ని అనుకుంటున్నారా..అమెరికాలో నివసిస్తున్న ఆయ‌న‌ ఏకైక కుమార్తె సస్య త‌న త‌ల్లి కాశీ అన్న‌పూర్ణాదేవీ మైన‌పు విగ్ర‌హాన్ని త‌న తండ్రికి బ‌హుమ‌తిగా ఇచ్చారు. అన్నపూర్ణా దేవి 2020 జూలై 17న అనారోగ్యంతో మరణించింది. ఆమె లేని లోటును కుటుంబ‌రావు జీర్ణించుకోలేక‌పోయేవారు.

నా భార్య నా జీవితానికి వెలుగు..ఈ రోజు నా విజయవంతమైన వ్యాపారానికి నేను ఆమెకు రుణపడి ఉన్నానని భావోద్వేగంతో కుటుంబరావు అన్నారు. మొదటి గదిలో ఒక పెద్ద చెక్క ఊయల మీద కూర్చున్నత‌న భార్య మైనపు బొమ్మను చూస్తు త‌న భార్య స‌జీవంగా త‌న‌తోనే ఉన్న‌ట్లుగా ఆయ‌న ఫీల్ అవుతున్నారు. ఇదే చెక్క ఊయ‌ల‌పై ఆమె బ్ర‌తికి ఉన్న‌ప్పుడు దానిపై కూర్చుని టీవీ కార్య‌క్ర‌మాల‌ను చూసేద‌ని కుటుంబరావు గుర్తు చేసుకున్నారు.త‌న తండ్రి డిప్రెషన్‌లో కూరుకుపోతున్నాడ‌ని తెలుసుకున్న కూతురు స‌స్య ఆయ‌న‌కి కాస్త ఊరటనిస్తుందని భావించి మైనపు విగ్రహాన్ని అతనికి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన చేసింది.న‌వంబ‌ర్ 14న త‌న త‌ల్లి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ విగ్ర‌హాన్ని త‌న తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చింది. పచ్చని పట్టు చీర కట్టుకుని, మెరిసే నగలతో అలంకరించుకున్న ఈ విగ్రహం ఏ క్షణమైనా మాట్లాడుకునేలా కనిపిస్తుంది. విగ్రహం ఉంచిన గదిని దేవాలయంలా కుటుంబ‌రావు పరిగణిస్తారు. మామిడి, సీతాఫలాలు ఆమెకు ఇష్టమైన పండ్లని..కాబట్టి తాను వాటిని ప్రతిరోజూ ఆమె ముందు ఉంచుతాన‌ని కుటుంబ‌రావు తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుంటాన‌ని తెలిపారు.

మండ‌వ కుటుంబ‌రావు సామాజిక కార్య‌క్ర‌మాలు చేయ‌డంలో ముందుంటారు. త‌న భార్య పేరుతో పేద‌ల‌కు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందింస్తుంటారు. ప్ర‌తివారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిత్య అన్న‌దానికి విజ‌య‌వాడ నుంచి లారీ ద్వారా కూర‌గాయ‌లు పంపిస్తుంటారు. త‌న భార్య లేని లోటును మైన‌పు విగ్ర‌హం లో చుసుకుంటున్నాన‌ని.. ఈ లోటుని తీర్చినందుకు త‌న కూతురు స‌స్య‌కు కుటుంబ‌రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు.