Site icon HashtagU Telugu

Makar Sankranti : సంక్రాంతి రోజున ఇవి తింటేనే పండగ..

Sankranthi Pindi Vantalu

Sankranthi Pindi Vantalu

సంక్రాంతి (Makar Sankranti) సంబరాలు మొదలయ్యాయి..గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వాతావరణం జోరందుకుంది. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా సొంతర్లకు , వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. బ్రతుకు తెరువు కోసం పల్లె ను వదిలి.. పట్టణాలకు వెళ్లిన వారంతా పల్లెల బాటపడతారు. అందుకే సంక్రాంతి అంటే.. పల్లెల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ అని అందరూ భావిస్తారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది.

అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఇక సంక్రాంతి పండగ పిండి వంటల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రాంతీయ వంటకాల సమ్మేళనంతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడిపోతుంటాయి. అరిసెలు, పాకుండలు, పొంగనాలు, బూరెలు ఇలా దేనికివే ప్రత్యేకం. ఈ వంటకాలు తింటేనే వారికి సంక్రాంతి వేడుక చేసుకున్నట్టు. ఇవి లేకుంటే సంక్రాంతి అనేదే లేనట్లని ప్రజలు భావిస్తారు. బంధువులకు..వచ్చే పోయేవారికి ఇలా అందర్నీకి ఈ వంటకాల రుచి చూపిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక సంక్రాంతినాడు కొత్త బియ్యంతో పిండివంటలు చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. సంక్రాంతినాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలే కాదు, రైతుల మనసులు కూడా నిండుగా ఉంటాయి. కానీ.. కొత్తబియ్యంతో ఎవరూ అన్నం వండరు. అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది. అందుకే.. వాటిని నానబెట్టి, పిండి ఆడించి బెల్లంపాకం పట్టి అరిసెలు వండుతారు. అలాగే పాలుపొంగించి, కొత్తబియ్యంతో పరమాన్నాన్నీ వండుకుంటారు. ఇలా కొత్తబియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు. అలాగే.. కొత్త బియ్యంతో వండిన పిండివంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పించడం వల్ల, పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులు.

ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాఖాహారమే భుజించాలి. ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం, ఆరోగ్యసూత్రం అని నమ్ముతారు. ఇలా సంక్రాంతి రోజుల్లో చక్కటి పిండివంటలతో కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

Read Also : Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం

Exit mobile version