Magunta Resigns YCP : వైసీపీకి మాగుంట గుడ్ బై ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా... అప్పుడే కొంచెం హీట్ కనిపిస్తోంది. రానున్న రెండు నెలల్లో మరింత వేడేక్కే అవకాశాలున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Magunta Srinivasulu Reddy

Magunta Srinivasulu Reddy

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా… అప్పుడే కొంచెం హీట్ కనిపిస్తోంది. రానున్న రెండు నెలల్లో మరింత వేడేక్కే అవకాశాలున్నాయి. ఎందుకంటే కేబినెట్ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేలు గ్రామస్థాయి నుంచే ఇక ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో పరిస్థితులు మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల వరకూ ప్రజల్లో ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పేయడంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే పార్టీలో వర్గపోరు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తోంది. నిజానికి ఏ పార్టీలోనైనా వర్గపోరు ఉంటుంది. అయితే వైెఎస్సార్సీపీకి సంబంధించి జగన్ వర్గపోరును నియంత్రించడంలో బాగానే సక్సెస్ అయ్యారు. అయినప్పటకీ కొన్ని కొన్ని చోట్ల తెరపైకి వస్తూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఇతర నేతలతో ఇమడని కొందరు వైెఎస్సార్సీపి నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఒంగోలులో బాగా పలుకుబడి ఉన్న రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్న మాగుంట 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. తెలుగుదేశం తరపున ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయినా… తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే గెలిచినప్పటి నుంచీ పార్టీలో ఇమడలేకపోయారని ఆయన సన్నిహితులే కాదు పార్టీ వర్గాల మాట కూడా. స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విభేదాలే దీనికి కారణం. బాలినేని ప్రకాశం జిల్లా ఇంఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కడం కష్టమేనని మాగుంట ఓ అభిప్రాయానికొచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే తన సీటు కంటే కూడా తన కొడుకు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు మాగుంట. తన కుమారుడికి మార్కాపురం అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు.

అయితే బాలినేనితో ఉన్న గ్యాప్ కారణంగా తనతో పాటు తన కొడుక్కి కూడా వైఎస్సార్సీపీ టిక్కెట్లు దక్కడం కష్టమేనని మాగుంట భావిస్తున్నారు. ఈ కారణంగానే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ,జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత సమీకరణాలను చూసుకుని టీడీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ టీడీపీ,జనసేన పొత్తు లేకుంటే మాత్రం మాగుంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి.. తన కుమారుడిని మార్కాపురం నుంచి బరిలోకి దింపాలన్న మరో ప్లాన్ ను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మాగుంట రాజకీయ భవిష్యత్తు ప్రతిపక్షాల పొత్తుపై ఆధారపడి ఉంది.

  Last Updated: 28 Mar 2022, 01:25 PM IST