ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నవంబర్ 24వ తేదీన.. అంటే మరో రెండు రోజులలోఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు వచ్చే రెండు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటుగా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించారు.
మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆ తర్వాతి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి.. నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 01 వరకు ఏపీలోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్షాల నేపథ్యంలో రైతులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని తెలిపింది. ధాన్యం రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని.. తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచనలు చేసింది.
వరికోతల నేపథ్యంలో రైతులు ముందుగానే వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని.. పండిన ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని సూచించింది. ఇక అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070, 18004250101 సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
