Murder : రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళల మనోభావాలు, ఆలోచనలు, ఇష్టాలు, అయిష్టాలు లెక్క చేయకుండా కేవలం శారీరక సుఖం కోసం, తమ అహంకారాన్ని తీర్చుకోవడానికి దాడికి తెగబడే మగాళ్లు ఉన్న సమాజంలో స్త్రీలు అడుగడుగునా భయంతో బ్రతుకుతున్నారు. వారు తమ కక్షలు తీర్చడానికి అఘాయిత్యంగా ప్రవర్తించి, మృగంలా మారిపోతున్నారు. ఫలితంగా, ఎంతో దురదృష్టకరంగా మహిళలు తమ ప్రాణాలను కోల్పోతున్నప్పుడు, ఈ కామాంధులు మాత్రం కటకటాలపాలవుతున్నారు. కాలం, ప్రాంతం, పరిస్థితులు ఏమైనా, మహిళలకు ఎప్పటికైనా, ఎప్పుడూ ముప్పు తప్పడం లేదు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రజకవీధిలో జరిగిన ఓ దారుణ ఘటనలో ఇలాంటి మానవత్వం లేకుండా ప్రవర్తించిన యువకుడు ఓ వివాహిత మహిళను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. వివాహేతర సంబంధంలో ఉండి, కొంతకాలం కలిసి జీవించిన తర్వాత ఆ యువకుడు చేసిన పోకడలకు ఆ మహిళ దూరంగా పోయింది. అయితే.. తనతో సహజీవనానికి నో చెప్పిందని సదరు మహిళపై ఆ దుర్మార్గుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. సుహాసిని అనే మహిళ తన భర్త అనారోగ్యంతో మరణించగా, ఆమె ఇద్దరు చిన్న పిల్లలతో గిద్దలూరులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తూ జీవించేది. అయితే.. ఇంతలో, ఆమె స్వగ్రామం రాచర్లకు చెందిన నాని అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం పాటు కలిసి జీవించిన తర్వాత, నాని వ్యవహార శైలి తనకు నచ్చకపోవడంతో అతడిని దూరం పెట్టింది మహిళ. తనతో సహజీవనం చేయడం లేదని కక్షగట్టి.. ఆమెను హత్యచేయాలని నాని ఒక పథకాన్ని రచించాడు.
రెండు రోజుల క్రితం, సుహాసిని గిద్దలూరులో ఉన్నప్పుడే నాని ఆమె వద్దకు వచ్చి, ఆమెతో మాట్లాడతూనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో.. ఆమె ఛాతీలో తీవ్రంగా గాయమైంది.. సుహాసిని కేకలు వేయగా, నాని అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడ చికిత్స అందించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో, మరింత మెరుగైన వైద్యానికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుహాసిని మృతిచెందింది. ఈ దారుణ ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also : U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయం