Site icon HashtagU Telugu

AP : చిత్తూరు జిల్లాలో గజరాజు బీభత్సం.. గ్రామస్తులు హడల్!

చిత్తురు జిల్లాకు గజరాజుల తాకిడి ఎక్కువైంది. గత ఆరేడు నెలలుగా ఎక్కడపడితే అక్కడ సంచరిస్తూ జిల్లా ప్రజలను కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఏనుగుల గుంపుతో పలు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా చిత్తరు జిల్లాలోని పలమనేరులోని ఓ ఏనుగు భీభత్సం చేస్తోంది. గ్రామంలోని ముగ్గురు రైతుల పంటలను ధ్వంసం చేయడమే కాకుండా, పంట పొలాలకు ఉన్న ఫెన్సింగ్ సైతం తొక్కేసింది.

పలమనేరు నియోజకవర్గంలోని అరడజను గ్రామాల్లో దాదాపు పదిహేను రోజులుగా ఓ ఏనుగు రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. అటవీ శాఖాధికారులకు కూడా సమాచారం అందించారు. ఒంటరి ఏనుగుల సమాచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుండగా, మాధవరం గ్రామం తవణంపల్లెలో మరో ఏనుగు కనిపించింది. నవంబర్ 12 రాత్రి పొలాల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను లాగేయడంతో పాటు వరి, కూరగాయల సాగును పూర్తిగా చిందరవందర చేసింది. దీంతో యువకులు కొంతమంది క్రాకర్లు కాల్చి ఏనుగును తరిమికొట్టడానికి ప్రయత్నించినప్పటికీ.. వారిపై దూసుకువచ్చే ప్రయత్నం చేసింది.

అయితే కౌండిన్య అభయారణ్యం మండలానికి చెందిన అడవి ఏనుగుల గుంపు పలమనేరు సమీపంలోని పశువుల ఫారం వద్ద టెర్రకోట భవనాన్ని దాటుతున్నట్లు గుర్తించామని, వాటి కదలిక సీసీ కెమెరాలో చిక్కిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (చిత్తూరు వెస్ట్) ఎస్.రవిశంకర్ తెలిపారు. “ప్రస్తుతం అభయారణ్యం ప్రాంతంలో అనేక ఏనుగుల గుంపులు తిరుగుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా రైతులు బహిరంగ ప్రదేశాల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. తెల్లటి దుస్తులు ధరించడం మానుకోవాలని, పొలాల్లో రాత్రిపూట జాగరణ చేయాలని సూచించారు.