Site icon HashtagU Telugu

Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Lokesh's satire on Jagan

Lokesh's satire on Jagan

Vip Passes : పులివెందుల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో, పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి “వీఐపీ పాసులు” జారీ చేయడంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ చర్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. సోషల్‌ మీడియా వేదికగా లోకేశ్‌ స్పందిస్తూ, “ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ… తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!” అంటూ జగన్‌ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.

ఘోర ఓటమి తర్వాత తొలి పర్యటన

జగన్‌ ఇటీవల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎదురైన భారీ పరాజయం అనంతరం తొలిసారి పులివెందులకు వచ్చారు. ఈ సందర్బంగా, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడంకోసం సోమవారం నియోజకవర్గానికి చేరుకున్నారు. అయితే, కార్యకర్తలను కలవడంలో అనూహ్యంగా “వీఐపీ పాసు” వ్యవస్థను ప్రవేశపెట్టడం, భద్రతా సిబ్బంది కేవలం పాసులున్నవారినే అనుమతించడం స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తించింది.

కార్యకర్తల్లో అసంతృప్తి, వాగ్వాదం

ఈ పద్ధతికి అనేకమంది పార్టీ కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న తమకు పిలుపు రాకపోవడం, వీఐపీ పాసులేని కారణంగా కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడం వారిని ఆవేదనకు గురిచేసింది. కొందరు కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సొంత కార్యకర్తలతో భద్రతా గోడలు వేయడం ఏమిటి? ప్రజల మధ్య ఉండే నాయకుడు ఇలా చేస్తాడా? అని వారు ప్రశ్నించారు.

పార్టీలోనే విమర్శలు

ఇక, ఇదంతా పార్టీ లోపలికి చేరగా, కొందరు నేతలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది పాత వైఎస్సార్‌ శైలి కాదు. రాజన్న ప్రజల మధ్య నడిచి మాట్లాడే నాయకుడు. ఇప్పుడు జగన్‌ మాత్రం పార్టీ కార్యకర్తలే కాక, పౌరులను కూడా వడపోసే ధోరణిలో ఉన్నాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వేధింపుల్లో జగన్‌? లేక కొత్త వ్యూహమా?

ఈ పరిణామం నేపథ్యంలో, రాజకీయ విశ్లేషకులు జగన్‌ నిర్ణయాన్ని వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఓ వైపు భద్రతా కారణాలేంటని అంటున్నా, మరోవైపు పార్టీ కార్యకర్తలే నిరాశకు గురవడం ఆయనకు కొంత నష్టమేనని భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ అట్టడుగు స్థాయి వర్గాల నుంచి ఎదురయ్యే స్పందనను అంచనా వేయాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి తప్పదని వారు అంటున్నారు.

Read Also: BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్