Site icon HashtagU Telugu

Jagan Arrest : జగన్ అరెస్ట్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్

Lokesh Jagan Arrest

Lokesh Jagan Arrest

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గురువారం అమరావతిలో విలేకర్లతో మాట్లాడిన రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్ట్ అవుతారా అన్న ప్రశ్నకు లోకేష్ బదులిస్తూ.. “చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టి సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అని ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి నాయకుడిగా పనికిరాడని అనుమానం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతీశారని లోకేష్ మండిపడ్డారు. అత్యధిక పన్నులు చెల్లించే సంస్థ అమర్‌ రాజా వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేలా చేశారని, లులూ గ్రూప్‌ను సైతం ఏపీ నుంచి తరిమేశారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని, సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి “రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుంది” అంటూ ఈమెయిళ్లు పంపారని, అతనికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని, ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థతో సంబంధమున్నట్లు తెలిసిందని లోకేష్ స్పష్టం చేశారు. దీనిని ఆయన ‘క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్’గా అభివర్ణించారు.

Water Tax : నీటి పన్నుపై రూ. 85.81 కోట్ల వడ్డీ మాఫీ – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని చేసిన విమర్శలను లోకేష్ తిప్పికొట్టారు. “ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు జగన్ బయటకు రాగలరా?” అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా అని గుర్తు చేశారు. తమ లక్ష్యం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని లోకేష్ పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్‌ను తిరిగి సాధించేలా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు, టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయని, విశాఖను ఐటీ పటంలో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణపై దృష్టి సారించినట్లు వివరించారు.

లిక్కర్ స్కామ్‌పై కూడా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ స్కామ్ లో పక్కా ఆధారాలు ఉన్నాయని, ఒక లిక్కర్ కంపెనీ రూ. 400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ‘ఆదాన్’ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దమ్ముంటే ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ లోకేష్ సవాల్ విసిరారు.