Lokesh on Jagan: బినామీలతో జగన్ దోపిడీ : మూడో రోజు పాదయాత్రలో లోకేష్

నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మూడో రోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మీదుగా వెళ్తున్న లోకేశ్‌కు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు.

  • Written By:
  • Updated On - January 29, 2023 / 09:31 PM IST

Lokesh Padyatra: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మూడో రోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మీదుగా వెళ్తున్న లోకేశ్‌కు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. సెల్ఫీల కోసం యువత పోటీ పడ్డారు. ఆ తర్వాత స్థానిక మహిళలతో లోకేశ్‌ భేటీ అయ్యారు. మూడున్నరేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యువనేత ఎదుట మహిళలు వాపోయారు. అమ్మఒడి పేరుతో తమను జగన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిపురానికి ఏమీ చేయలేదని, స్థానిక ఎమ్మెల్సీకి దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టదని నారా లోకేశ్‍ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం శాంతిపురంలో నిర్వహిస్తున్న వార సంతలో పర్యటించారు. సంతలో ప్రజలు, దుకాణాదారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వినియోగదారులు లోకేశ్‍కు వివరించారు. వార సంత రహదారిపై నిర్వహించు కుంటున్నామని, స్థలం కేటాయించాలని దుకాణదారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కొబ్బరి బొండాలు అమ్మే దివ్యాంగుడు నాగరాజు ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నానని తెలపడంతో నాలుగు రోజుల్లో అందజేస్తానని లోకేశ్‍ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల కేంద్రాలను మూసేసి కనీసం తాగునీరు ఇవ్వలేని చెత్త ప్రభుత్వమని విమర్శించారు. కనీసం బస్టాండ్లు పాడైతే తిరిగి నిర్మించే దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. వార సంత నిర్వహణకు టీడీపీ అధికారంలోకి రాగానే స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

బినామీలతో రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు

ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తేనే నిత్యావసర ధరలు తగ్గుతాయని, దీనిపై సమీక్షించి అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని లోకేశ్​ స్పష్టం చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. మద్యం సీసా తయారీ నుంచీ మద్యం తయారీ, అమ్మకం వరకు అంతా జగన్ రెడ్డి బినామీలేనని ఆరోపించారు. 45ఏళ్ల మహిళలకు పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైందని లోకేశ్ నిలదీశారు. అమ్మఒడికి కోత పెట్టడంతో పాటు ఆంక్షలతో లబ్ధిదారుల్ని కుదించేశాడని మండిపడ్డారు. శాసనసభ సభ సాక్షిగా దిశా చట్టంపై అసత్యాలు పలికారని విమర్శించారు.

మభ్యపెట్టే కుట్రలపై కలిసికట్టుగా పోరాడుదాం

దిశ చట్టమే లేకుండా, పీఎస్​లు, వాహనాలు పెట్టి మభ్యపెడుతున్నారన్న లోకేశ్ మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21రోజుల్లో ఉరిశిక్ష వేశారా అని ప్రశ్నించారు. మాయమాటలతో ఇంకా మభ్యపెట్టే కుట్రలపై కలిసికట్టుగా పోరాడదామన్నారు. కుప్పం శాంతిపురంలో వివిధ వర్గాల మహిళలతో లోకేశ్​ సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో ధరల భారం మోయలేకపోతున్నామని మహిళలు లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు సంఘాలను నిర్వీర్యం చేయటంతో స్వయం ఆర్థికాభివృద్ధి కూడా కుంటపడిందని డ్వాక్రా మహిళలు తెలిపారు. గత ఎన్నికల్లో ఒక్క అవకాశం మాట నమ్మి చారిత్రక తప్పిదం చేశామని మహిళలు వాపోయారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తమ బిడ్డలకు ఇక భవిష్యత్తు లేదనే విషయాన్ని మహిళలు గ్రహించామన్నారు. తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. చంద్రబాబు మహిళలకు అందించిన చేయూతపై ఓ మహిళ పాటపాడి అందరినీ అలరించింది.

మూడున్నరేళ్లలో 32ఏళ్లు వెనక్కి

తెలుగుదేశం అధినేత చంద్రబాబుని వైసీపీ నేతలు ఒకవైపే చూడాలని, రెండోవైపు చూడాలనుకోవద్దని నారా లోకేశ్ హెచ్చరించారు. శాంతిపురంలో టీ స్టాల్ కి వెళ్లి టీ తాగిన లోకేశ్​.. నిర్వాహకుడు కృష్ణప్పతో కాసేపు మాట్లాడారు. గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు పెరిగిపోవడంతో పెద్దగా ఏమీ మిగలడం లేదంటూ క్రిష్ణప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిపురం మెయిన్ సెంటర్​లో భారీ గజమాలలతో నారా లోకేశ్​కు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కుప్పంలో చంద్రబాబు కట్టించిన రక్షిత మంచినీటి ట్యాంక్​ను కూడా నిర్వీర్యం చేసి తాగేందుకు నీరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలోనూ విధ్వంసాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం 32ఏళ్లూ వెనక్కి తీసుకెళ్లిందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు.

తాళిబొట్లనూ తాకట్టు పెట్టిన జగన్ రెడ్డి

మహిళల తాళి బొట్లు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్‍ రెడ్డి అని లోకేశ్‍ దుయ్యబట్టారు. టీడీపీ అధికారం వచ్చిన తరువాత విద్యార్థి దశ నుంచే మహిళల గొప్పతనం, త్యాగాలు, కష్టాలు తెలిసే విధంగా ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతామని, మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మూడో రోజు పాదయాత్ర ప్రారంభించిన ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను ఆయనకు వివరించారు. అమ్మ ఒడి ఇచ్చామంటు పన్నులు విపరీతంగా పెంచారని మహిళలు తెలిపారు. అనేక సాకులు చెప్పి అమ్మ ఒడిలో డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని, ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదన్నారు. మద్యపాన నిషేదం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడని నారా లోకేశ్‍ దుయ్యబట్టారు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదన్నారు. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. ఇప్పుడు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చే అమ్మ ఒడి కూడా ఏడాది ఎగొట్టారన్నారు. 45 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ అన్న జగన్‍ ఇస్తున్నారా.? అని ఆయన ప్రశ్నించారు.