తెలుగుదేశం పార్టీ (TDP) సభ్యత్వ నమోదు (Membership Registration) కార్యక్రమం సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26 న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు 1,00,52,598 కి చేరుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు , నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువ నేత , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)..హర్షం వ్యక్తం చేస్తూ నోట్ విడుదల చేసారు.
నోట్ లో ఏముందంటే..
విశ్వ విఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు (NTR) పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది. సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ఒక పండగలా నిర్వహించారు. ఊరూవాడా జై టిడిపి నినాదాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం, బలగం, పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్
పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టిడిపి అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య గారు నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులు ఉన్మాదుల్లా మీద పడుతుంటే మీసం మెలేసి, తొడకొట్టి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ నాకు నిత్యస్పూర్తి, సార్వత్రిక ఎన్నికల్లో బూత్ ఏజెంట్గా ఉండటానికి వీలు లేదని ప్రత్యర్థి మూకలు గొడ్డలి వేటు వేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్ బూత్లో కూర్చొని రిగ్గింగ్ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల గారి ధైర్యం గురించి గుర్తుచేసుకున్న ప్రతిసారి నాకు గర్వంగా ఉంటుంది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి గ్రామంలో ప్రాణం ఎక్కువా? పార్టీ ఎక్కువా? అంటే పార్టీనే ఎక్కువ అని జైకొట్టే చేతులు అనేకం. ఏమి ఇచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టిడిపి కి మాత్రమే సొంతం. అలానే ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుంది.
అధినేత చంద్రబాబు గారు పార్టీలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కార్యకర్తలతో చర్చించిన తరువాతే ప్రకటిస్తారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం మాత్రమే. మంచి నిర్ణయం తీసుకుంటే పొగిడేది మీరే, ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ప్రశ్నించేది మీరే. అందుకే పార్టీలో ప్రతి కార్యకర్త అధినేతే, కార్యకర్తల సంతోషమే చంద్రబాబు గారికి ఆనందం. ఆయన నాతో మాట్లాడిన ప్రతిసారి కార్యకర్తల చర్చ ఖచ్చితంగా ఉంటుంది. కార్యకర్తలకు ఉపాధి, వైద్యంతో పాటు వారి పిల్లల చదువుకు సాయం చెయ్యాలని చెబుతుంటారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పవిత్రమైన బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించాం. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందజేసాం. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించాం. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ.19 కోట్లు ఆర్థిక సహాయం చేసాం. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించాం.
చదువు పూర్తయిన వారికి ఉపాధి.. ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ.5 లక్షలకు పెంచాం. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే నా ఎజెండా. కొన్ని నియోజకవర్గాల నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షకుపైగా సభ్యత్వాలు చెయ్యడంతో పాటు లైఫ్ టైమ్ సభ్యత్వాలు కూడా ఎక్కువగా చేశారు. వారికి నా ప్రత్యేక అభినందనలు. లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యకర్తకు భరోసా ఇచ్చే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.