ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం, భాషా విద్యపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh )జాతీయ విద్యా విధానం (NEP) మరియు త్రిభాషా విధానంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భారతదేశంలో భాషా విద్యను రాజకీయం చేయవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జాతీయ విద్యా విధానం (NEP) విద్యార్థులకు వారి మాతృభాషతో సహా మూడు భాషలను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఈ విధానం ఏ రాష్ట్రంపైనా హిందీని తప్పనిసరి చేయదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ మాతృభాషలో పునాది వేసుకుని, అదనంగా మరో రెండు భాషలను నేర్చుకోవడం వల్ల వారి భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Karnataka : ఆశ లేకుండా జీవించలేం..ఆశలతోనే జీవితం: సీఎం పదవి పై డీకే శివకుమార్
తాను స్వయంగా మూడు భాషలు నేర్చుకోవడం వల్ల ఎంతగానో లబ్ధి పొందానని, ఆ అనుభవంతోనే ఈ విధానాన్ని సమర్థిస్తున్నానని లోకేష్ తెలిపారు. “నేను మూడు భాషల వల్ల లబ్ధి పొందినవాడిని. మనం నేర్చుకోవడంపై దృష్టి పెడదాం, రాజకీయం చేయడం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మూడు భాషలను నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, వివిధ ప్రాంతాల ప్రజలతో సంభాషణ, మరియు సాంస్కృతిక అవగాహన పెరుగుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో భాషా విద్యపై రాజకీయాలు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భాషా విద్యలో ముఖ్యంగా మాతృభాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరిగింది. పిల్లలు తమ సొంత భాషలో ప్రాథమిక విషయాలను నేర్చుకోవడం వల్ల వారిలో అవగాహన, ఆలోచనా సామర్థ్యం మెరుగవుతాయని అన్నారు. ఆ తర్వాత అదనపు భాషలను నేర్చుకోవడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి, విద్యను రాజకీయాలకు అతీతంగా చూడాలని, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని లోకేష్ పిలుపునిచ్చారు. త్రిభాషా విధానాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయడం ద్వారా యువత భవిష్యత్తును మెరుగుపరచవచ్చని లోకేష్ అన్నారు.