Amaravati Farmers ఏపీ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. రెండో విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. రైతులకు స్థలాల కేటాయింపులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు.
- అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త
- రూ.1.50 లక్షలు రుణమాఫీ చేస్తామన్న నారాయణ
- జనవరి 6 వరకు తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ఇవాళ రెండో విడత భూ సమీకరణ ప్రారంభంకాగా.. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి పర్యటించారు.. భూ సమీకరణనను ప్రారంభించారు. ఈ క్రమంలో అమరావతి రైతులకు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. గతంలో అమరావతి ప్రాంతంలో జరిగిన భూసమీకరణలో భాగంగా.. స్థానిక రైతులకు రుణమాఫీ చేశామని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ గుర్తు చేశారు. రైతులు తమ భూములపై తీసుకున్న రుణాలను గతంలో రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఇప్పుడు కూడా రుణమాఫీ చేయాలని ఆయన కోరారు. అయితే తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయమై మాట్లాడానని.. ఆయన దీనికి అంగీకరించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెల (జనవరి) 6 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు.
ఇవాళ అమరావతిలో రెండో విడత భూ సమీకరణ మొదలైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. రాజధాని రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం 16,666.57 ఎకరాలను తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల నుంచి సేకరించనుంది. ఈ భూమిని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వేట్రాక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాల కోసం సేకరిస్తున్నారు. రైతులకు కేటాయించే స్థలాల అభివృద్ధికి అమరావతి అథారిటీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లలో ముందుగా రెండు వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా రైతులకు వారి స్థలాలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. అమరావతి అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన అడుగు.
వైఎస్సార్‌సీపీ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడం, వరల్డ్ బ్యాంక్‌కు నిధులు విడుదల చేయవద్దని లేఖలు రాయడం వంటివి ఆ పార్టీకి అలవాటుగా మారిందని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడిన జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. ఆయన చేసిన అన్యాయంపై రైతులు నిరసన తెలిపారని చెప్పారు. రాజధానిలో రెండో విడత భూసమీకరణ సందర్భంగా వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్థికపరమైన అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించి సీఎం చంద్రబాబు నిధులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. రాజధాని అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం అడ్డుకుందని.. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించి.. గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణను ఎమ్మెల్యే కోరారు. హరిశ్చంద్రపురం ఈనాం భూముల విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. తాడికొండ నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన మూడు గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి అన్నారు. భూ సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే, మంత్రిని స్థానిక రైతులు ప్రశ్నించారు.. అమరావతికి చట్టబద్ధతతో పాటుగా అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
