Site icon HashtagU Telugu

Loan Apps Harrasment : మంత్రికి ఫోన్ వేధింపు క‌థ సుఖాంతం

Kakani Case

Kakani Case

ఏపీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డికి ఫోన్ వేధింపులు చికాకు పెట్టించాయి. ఒకే రోజు ప‌లు నెంబ‌ర్ల ద్వారా ఆయ‌న ఫోన్ కు డ‌య‌ల్ చేసి వేధించారు. దీంతో పోలీసుల‌ను మంత్రి కాకాని ఆశ్ర‌యించ‌డంతో వేధింపుల‌కు తెర‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే, అశోక్ కుమార్ ఒక కంపెనీ నుంచి రూ. 8.50ల‌క్ష‌ల లోన్ తీసుకున్నాడు. ఆయ‌న వ‌ద్ద నుంచి లోన్ రిక‌వరీ కోసం కంపెనీ ఏజెంట్లు ఫోన్లు చేస్తున్నారు. కానీ, అశోక్ కుమార్ స్పందించ‌క‌పోడంతో ఆయ‌న కాల్ లిస్ట్ లోని ఫోన్ నెంబ‌ర్ల ద్వారా ఫోన్లు చేయ‌డం మొద‌లు పెట్టారు. అలా, మంత్రి ఫోన్ నెంబ‌ర్ కు ప‌లుమార్లు రిక‌వ‌రీ ఏజెంట్లు ఫోన్ చేయ‌డం జ‌రిగింది. ఆ ఫోన్ల‌ను మంత్రి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ఉన్న శంక‌ర‌య్య లిఫ్ట్ చేశాడు. వాళ్లు దుర్భాషలాడి వేధించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచార‌ణ‌లో చెన్నైకి చెందిన నలుగురు లోన్ రికవరీ ఏజెంట్లుగా గుర్తించి, వాళ్ల‌ను అరెస్టు చేశారు.

అయితే, శంకరయ్య తర్వాత ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో, ఏజెంట్లు 300 మంది టెలి-కాలర్‌లతో చెన్నై నుండి ఆపరేట్ చేస్తున్న కాల్‌మ్యాన్ సేవల కోసం పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముత్తుకూరు పోలీసులు వల వేసి నలుగురు ఏజెంట్లను నెల్లూరు నగరంలోని పొదలకూరుకు చెందిన పెసల పెంచలరావు (38), చెన్నైలోని తిరువెర్కాడుకు చెందిన కోల్‌మన్ సర్వీస్ టీమ్ లీడర్ మాధురి వాసు (25), వరదయ్యపాలెంకు చెందిన గురుప్రసాద్ రెడ్డి (36) చెన్నైలోని కొరటూరుకు చెందిన శివనాసన్ మహేంద్రన్ (42) ప‌ట్టుకున్నారు.

“అశోక్ కుమార్ రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున, రుణగ్రహీత మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులను ఏజెన్సీ సంప్రదించింది. అందులో భాగంగా అశోక్‌కుమార్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నంబర్‌కు కూడా ఫోన్‌ చేశారు. లోన్ రికవరీ ఏజెంట్లకు అశోక్ మంత్రి నంబర్‌ను ప్రత్యామ్నాయ నంబర్‌గా ఇచ్చాడు. దీంతో లోన్ క‌ట్ట‌మ‌ని డిమాండ్ చేస్తూ మంత్రికి ఏజెంట్లు ఫోన్ చేశారు. మాజీ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌కు కూడా అదే ఏజెన్సీ నుంచి ఫోన్ లు వ‌చ్చాయ‌ట‌. అశోక్‌కుమార్‌ రుణ వాయిదాలు చెల్లించాలని వేధిస్తూ పలుమార్లు కాల్‌లు వచ్చాయని ఆల‌స్యంగా వెలుగు చూసింది. మొత్తం మీద లోన్లు తీసుకున్న అశోక్ కుమార్ మంత్రులు, మాజీ మంత్రులు నెంబ‌ర్ల‌ను ప్ర‌త్యామ్నాయంగా ఇచ్చి ఓ ఆటాడుకున్నాడన్న‌మాట‌.