Minister Nara Lokesh: చదువుకోవాలనే తన ఆశను మీడియా ద్వారా వెల్లడించిన చిన్నారి జెస్సీకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అండగా నిలిచారు. పత్తి పొలాల్లో కూలీగా మారిన జెస్సీ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి.. “చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో” అని భరోసా ఇవ్వడంతోపాటు, ఆమెకు చదువుకునే అవకాశం కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జెస్సీని చిలకలడోనలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చేర్చారు.
మంత్రి కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన జెస్సీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడి మానేసింది. ఐదవ తరగతి పూర్తి చేసిన జెస్సీ, ఆరవ తరగతిలో చేరడానికి చిలకలడోన కేజీబీవీలో దరఖాస్తు చేసుకుంది. కానీ సీటు లభించకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి పత్తి పొలాల్లో కూలీ పనులకు వెళ్లసాగింది. ఈ విషయం పత్రికల్లో వచ్చిన ఒక కథనం ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి వచ్చింది.
Also Read: Ashwin: అశ్విన్ బిగ్ బాష్ లీగ్, ILT20 ఆడనున్నారా?
తనకు చదువుకోవాలని ఉంది అని మీడియా ద్వారా తెలియజేసిన చిన్నారి జెస్సీకి "చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో" అని నిన్న భరోసా ఇచ్చాను. నేడు మా విద్యాశాఖ అధికారులు జెస్సీని చిలకలడోన కేజీబీవీలో చేర్పించారు. చిట్టి తల్లి కేజీబీవీలోకి ఎంటర్ అవుతుంటే.. అధికారులు స్వాగతించిన తీరు నాకు చాలా… https://t.co/gxT7f0NgZO pic.twitter.com/QDXL5GL7eM
— Lokesh Nara (@naralokesh) September 22, 2025
దీనిపై తీవ్రంగా స్పందించిన లోకేశ్.. “పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చిన్నారుల చేతులు పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జెస్సీకి భరోసా ఇచ్చిన మంత్రి, మంగళవారం విద్యాశాఖ అధికారులను పంపించి జెస్సీని కేజీబీవీలో చేర్పించారు. పాఠశాల ఆవరణలోకి అడుగుపెడుతున్న జెస్సీని అధికారులు సాదరంగా స్వాగతించారు. ఈ దృశ్యం తనకు ఎంతో సంతోషం కలిగించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అన్ని సదుపాయాలతో కూడిన మంచి వాతావరణంలో జెస్సీ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకోవాలనే ఆశ ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా వెనుకబడిపోకూడదని, అలాంటి వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి లోకేశ్ చొరవతో జెస్సీకి ఇప్పుడు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ సంఘటన రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ లక్ష్యాలకు, ముఖ్యంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలనే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
