AP Assembly: అసెంబ్లీలో లిక్క‌ర్ ర‌గ‌డ‌..!

  • Written By:
  • Updated On - March 14, 2022 / 02:36 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ, టీడీపీ పార్టీ స‌భ్యుల మ‌ధ్య లిక్క‌ర్ ర‌గ‌డ తీవ్ర‌స్థాయికి చేరుకుంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం అసెంబ్లీలో ఐదో రోజు టీడీపీ స‌భ్యులు స‌భ‌ను అడ్డుకుంటూ గంద‌ర‌గోళం సృష్టించారు. స‌భ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు.

ఈ నేప‌ధ్యంలో టీడీపీ స‌భ్యుల తీరుపై స్పీకర్ స్పీక‌ర్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను స్పీకర్ ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. అయినా జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన‌ వరస మరణాలపై చర్చించాలని ప‌ట్టు బ‌ట్టిన టీడీపీ స‌భ్యులు అసెంబ్లీలో నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అయితే మ‌రోవైపు జంగారెడ్డిగూడెం మరణాలకు సంబంధించిన అంశం పై టీడీపీ నేతలు కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

చంద్ర‌బాబు ఉతికిన కొడాలి నాని:

ఈ క్ర‌మంలో అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని టీడీపీ పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు జంగారెడ్డి గూడెం పర్యటన వట్టి నాటకమని కొడాలి నాని అన్నారు. అస‌లు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని కొడాలి నాని స్ప‌ష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన సహజ మరణాలను కూడా అక్రమ మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
దివంగత మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ నాడు సంపూర్ణ‌ మద్యపాన నిషేధాన్నిఅమలు చేస్తే, చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయ్యాక, మ‌ద్య‌పాన నిషేధానికి తూట్లు పొడుస్తూ బెల్టు షాపులను తిరిగి తెరిపించారని కొడాలి నాని గ‌ర్తుచేశారు.

ఇక రాజకీయాల కోసం మద్యాన్ని పెంచి పోషించింది చంద్రబాబే అని, చనిపోయిన వారిని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని, వారి ప్రతి ఒక్కరి ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారేలా చేయించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని కొడాలి నాని చెప్పారు. అంతే కాకుండా ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని, ఏపీలో అధికారం నుంచి దిగిపోయే ముందు బార్లకు ఐదేళ్లు లైసెన్సు ఇచ్చింది చంద్రబాబే అని కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సభ సజావుగా జరగాలంటే టీడీపీ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

బాబు హ‌యాంలో ఎనీ టైమ్ మందు.. రోజా:

రాష్ట్రంలో మద్యం మాఫియాతో తెలుగుదేశంపార్టీ కుమ్మక్కు అయిందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బెల్టు షాపులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, త‌న హ‌యాంలో 6 వేల స్కూళ్లు మూసేసి 40 వేల బెల్టు షాపులు తెరిచారని రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎనీ టైం మందు దొరికే తరహాలో పరిపాలించారని, బడి, గుడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు పెట్టించి, ఇంటింటికీ మందు స‌ర‌ఫ‌రా చేసే పరిస్థితికి తెచ్చారని ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. అలాగే స‌భ‌లో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అభ్యంతరం తెల‌కుపుతూ, స‌భ‌ను అడ్డుకోవడమే ప్ర‌తిప‌క్ష టీడీపీ పనిగా పెట్టుకుందని మండిప‌డ్డారు. సభను సాగనీయకుండా ప్రతిరోజూ అడ్డుపడుతున్నార‌ని, స‌భ‌లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

అసెంబ్లీలో ర‌చ్చ చేసిన టీడీపీ సభ్యుల సస్పెన్షన్:

ఇక మ‌రోవైపు అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై అధికార వైసీపీ నేతలకు అవకాశం ఇస్తూ, తమకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈక్ర‌మంలో స్పీక‌ర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన టీడీపీ స‌భ్యులు, టీడీపీ పక్షనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తమ చేతిలో ఉన్న కాగితాలను చింపివేసి స్పీకర్ పైకి విసిరారు. అంతే కాకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ స‌భ్యులు, పైకి ఎక్కి స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి, చింపిన కాగితాల‌ను స్పీకర్‌పై వేశారు. దీంతో సభలోకి మార్షల్స్ ఎంట్రీ ఇచ్చీ టీడీపీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీ స‌భ్యుల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన స్పీక‌ర్ త‌మ్మినేని, ఐదుగురు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశారు. ఈ క్ర‌మంలో బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని, ఈ సెషన్ మొత్తానికి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో జంగారెడ్డిగూడెం వరస మరణాల నేప‌ధ్యంలో టీడీపీ, వైసీపీల మ‌ధ్య జ‌రుగుతున్న మ‌ధ్యం పాలిటిక్స్ ఎంత దూరం వెళ‌తాయో చూడాలి.