Weather Update : ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ

ఏపీలో వ‌చ్చే మూడురోజుల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని...

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 09:18 AM IST

ఏపీలో వ‌చ్చే మూడురోజుల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి నైరుతి దిశగా వంగడం వల్ల రానున్న మూడు రోజులపాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడులోని ఉత్తర మధ్య అంతర్భాగం, పరిసర ప్రాంతాలలో మరో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.అయితే గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.