Site icon HashtagU Telugu

Leadership Crisis : తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం?

Leadership Crisis In Telugu Desam Party

Leadership Crisis In Telugu Desam Party

By: డా. ప్రసాదమూర్తి

Leadership Crisis in the TDP : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో జోస్యం చెప్పే ఘనాపాఠీలు ఎవరూ లేరు. అందునా మన దేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పెనుమార్పుల కలకలంలో ఈ అభిప్రాయం రోజు రోజుకీ మరింత పటిష్టమవుతోంది. అనూహ్యమైన పరిణామాలు జరిగే రంగం ఏదైనా ఉంటే అది రాజకీయ రంగమే. ఒకప్పుడు బీహార్ ను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్తాడని ఎవరైనా ఊహించగలిగారేమోగాని ఆయన అలా వెళితే వంటగదికి, ఇంటిపనికి, కుటుంబానికి పరిమితమైన ఆయన సతీమణి రబ్రీదేవి బీహార్ ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుందని ఎవరు ఊహించారు? దటీజ్ పాలిటిక్స్. ఇది ఇండియా. ఇక్కడ ఏమైనా జరగవచ్చు అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ తాజా పరిణామాలు చూస్తే ఏ రోజు ఏమలుపులు తిరుగుతాయా అని రాజకీయ జోస్యంలో తలపండిన పండిత ప్రకాండలు కూడా ఊహించలేకపోతున్నారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి ఆయువుపట్టు లాంటి నాయకులందరినీ లోపల వేసేయాలని లోపల్లోపల అనేక అనేక పథకాలు పన్నుతున్నారు (Crisis). చంద్రబాబు నాయుడు దీర్ఘకాలం జైలులో కొనసాగితే పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల్లో విజయం దిశగా పార్టీని నడిపించే సమర్థుడు ఎవరా అని పార్టీలో నాయకులు, కార్యకర్తలు తలపట్టుకు కూర్చున్నారు. సరే, ఆయన లేకుంటే లోకేష్ బాబు ఉన్నాడు కదా, ఆయన పార్టీని విజయపథం వైపు నడిపిస్తాడు అని అనుకోగానే, ఇప్పుడు లోకేష్ కూడా జైలులోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణను రంగంలో దించాలని ఆలోచన చేశారు. చంద్రబాబు మినహా తెలుగుదేశంలో మరొకరు ఎవరైనా చంద్రబాబుకు సాటిరారు.

సరిగ్గా ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ చిక్కిన అవకాశాన్ని చేజార్చుకోవడం రాజకీయ నాయకుని లక్షణం కాదని సకాలంలో గుర్తించి సమయస్ఫూర్తితో స్పందించారు. జనసేన పొత్తు తెలుగుదేశంతో ఉంటుందని రెండు పార్టీలు కలిసి ఎన్నికలలోకి వెళ్తాయని ఆయన ప్రకటించడంతో అనేక రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కి లాభం జరిగి, తెలుగుదేశానికి నష్టం జరిగే అవకాశం ఉందని, రానున్న కాలంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వెనుక నడిచే రోజులు రావచ్చని, టిడిపి వర్గాల్లో భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెరిగితే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ రెండో స్థానానికి పడిపోవచ్చు. ఇలాంటి ఆలోచనే పార్టీ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. అందుకే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడానికి పటిష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటా అని ఆలోచనలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అయితే, చంద్రబాబు లేకుంటే లోకేష్ బాబు. మరొకరు చేపడితే అది పార్టీ పతనానికి దారి తీయవచ్చు అని పైకి చెప్పినా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కుటుంబానికి ఆస్తి లాంటిది. దాన్ని మరొకరి చేతికి అందించడం ఆ కుటుంబంలో మరి ఎవరికీ ఇష్టం ఉండే అవకాశం లేదు. అందుకే ఒకవేళ లోకేష్ కూడా జైలు పాలైతే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రంగంలో దించాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు కొన్ని రోజులు ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆమె ఎన్నడూ బహిరంగంగా రాజకీయ వ్యవహారాలలో క్రియాశీలంగా పాల్గొన్న మహిళ కాదు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించడం వేరు. కానీ ఆ స్థానం దిశగా పార్టీని నడపడం అనే కీలకమైన బాధ్యత వేరు. అది భువనేశ్వరికి సాధ్యమవుతుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అకస్మాత్తుగా నారా బ్రాహ్మణి పేరు తీసుకువచ్చారు. లోకేష్ అనివార్యంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సివస్తే బ్రాహ్మణి పార్టీని ముందుండి నడుపుతుందని ఆయన చేసిన ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొన్ని అనుమానాలకు కూడా దారితీసింది. బ్రాహ్మణి వయసు రీత్యా చిన్నదే గానీ, రాజకీయ అనుభవం పెద్దగా ఏముంది అనేది ఆ అనుమానం. అయినా నారావారి కుటుంబంలో వ్యక్తి తప్ప మరొకరికి పార్టీ పగ్గాలు అప్ప చెప్పే పరిస్థితి లేదని అయ్యన్నపాత్రుడు తాజా ప్రకటనతో తేటతెల్లమైపోయింది.

తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుకు తీసుకువెళ్తారో, వాళ్ళు ఎంత సమర్థులో, వారి వెనక పార్టీ నాయకత్వం, అశేష కార్యకర్తల సమూహం ఎంతవరకు ఒకటై నడుస్తారో ఇప్పుడప్పుడే ఊహించడం కష్టం. కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత సంక్షోభంలో (Crisis) ఉందో ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అందరూ ఊహిస్తున్నట్టు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో కూడా పవర్ స్టార్ గా ఉదయించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడేదో కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు బనాయించి, జగన్ సంబరపడవచ్చు. కానీ రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ ఏకు మేకైతే అది జగన్ కి పెద్ద తలనొప్పే. అప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో మరో శకం మొదలవుతుంది.

Also Read:  AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఐదు రోజుల పాటు కొన‌సాగే ఛాన్స్‌..?