KTR and Chandrababu : ఏపీపై ‘వెట‌కారం’ ఆట

`అంద‌రూ బాగుండాలి, అందులో మ‌నం మెరుగ్గా ఉండాలనుకోవ‌డం సవ్య‌మైన ల‌క్ష‌ణం. మ‌నం మెరుగ్గా ఉండాలంటే, ప‌క్క‌న వాళ్లు చెడిపోవాలి అనుకోవ‌డం క్రూరం..

  • Written By:
  • Updated On - April 29, 2022 / 03:05 PM IST

`అంద‌రూ బాగుండాలి, అందులో మ‌నం మెరుగ్గా ఉండాలనుకోవ‌డం సవ్య‌మైన ల‌క్ష‌ణం. మ‌నం మెరుగ్గా ఉండాలంటే, ప‌క్క‌న వాళ్లు చెడిపోవాలి అనుకోవ‌డం క్రూరం..` స‌రిగ్గా దీన్ని తెలుగు రాష్ట్రాల రాజ‌కీయానికి అన్వ‌యించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల ముందు కేసీఆర్ ఏమ‌న్నారో ఒక‌సారి గుర్తు చేసుకుందాం. వ‌ర‌ల్డ్ ఢ‌ర్టీయెస్ట్ పొలిటిషియ‌న్ ఎవ‌రైనా ఉన్నారంటే, అది చంద్ర‌బాబే నంటూ ప్రెస్మీట్ పెట్టి అనేక అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, చంద్ర‌బాబును న‌మ్ముతున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒక న‌మ‌స్కారం అంటూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. అవ‌స‌ర‌మైతే విజ‌య‌వాడ వ‌చ్చి చంద్ర‌బాబు బ‌ట్ట‌లు విప్ప‌తీస్తాను అంటూ వ్య‌తిరేక బావుటా ఎగుర‌వేసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్ని విధాలుగా స‌హ‌కారం అందించారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఘోరంగా ఓడిపోయారు.

సీన్ క‌ట్ చేస్తే, `ఒక‌ప్పుడు ఏపీలో ఒక ఎక‌రం పొలం అమ్మితే తెలంగాణ‌లో మూడు ఎక‌రాలు వ‌చ్చేది. ఇప్పుడు తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్ముకుంటే ఏపీలో మూడు ఎక‌రాలు వ‌స్తుంది. దీన్నే సంప‌ద సృష్టించ‌డం అంటే` అంటూ అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఇంటికీ మంచినీళ్ల కుళాయి, కోత‌లు లేని క‌రెంట్ అందిస్తున్నామ‌ని ప్లీన‌రీ వేదిక‌గా చెబుతూ ఏపీ అంధ‌కారం అయింద‌ని వెల్ల‌డించారు. విద్యుత్ వెలుగుల‌తో మ‌ణిదీపంలా తెలంగాణ వెలిగిపోతుంటే ప‌క్క‌నే ఉన్న ఏపీ క‌రెంట్ కోత‌ల‌తో అంధ‌కారంలోకి వెళ్లింద‌ని గొప్ప‌లు చెప్పుకున్నారు. అమ‌రావ‌తి ప్రాజెక్టు ఏపీలో ఫెయిల్ కావ‌డంతో తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ భూమ్ వ‌చ్చింద‌ని మంత్రి హ‌రీశ్ రావు ఒకానొక స‌ద‌స్సులో బాహాటంగా చెప్పారు. ఏపీలో ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ప‌రిశ్ర‌మ‌లు తెలంగాణ‌కు ప‌రుగెత్తుకు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

మంత్రి కేటీఆర్ ప‌లుమార్లు ఏపీలోని క‌రెంట్ కోత‌లు, ఆర్థిక విచ్ఛిన్నం గురించి పారిశ్రామిక‌ స‌ద‌స్సుల్లో మాట్లాడారు. ఏపీలోని ప్ర‌తికూల అంశాల‌ను పారిశ్రామిక వ‌ర్గాల్లో నూరిపోశారు. చంద్ర‌బాబు విజ‌న్ ను ఎవ‌రూ కాద‌న‌లేర‌ని, రాజ‌కీయంగా మాత్రం ఆయ‌న్ను టార్గెట్ చేస్తామ‌ని బాహాటంగా చెప్పారు. తాజాగా గురువారం హైటెక్స్ లో జ‌రిగిన హోం ఫ‌ర్ ఆల్ అనే కార్య‌క్ర‌మంలో ఏపీ గురించి ఘోరంగా మాట్లాడారు. పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్న ఆ సద‌స్సులో తెలంగాణ అభివృద్ధి అర్థం కావాలంటే ఏపీకి పోయిరావాల‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. ఎవ‌రో ఫ్రెండ్ ఇటీవ‌ల ఏపీకి వెళ్లిన సంద‌ర్భంగా క‌రెంట్ కోత‌లు, మంచినీళ్ల స‌మ‌స్య గురించి చెప్పారని ఆ సంద‌స్సు వేదిక‌పై వివ‌రించారు. అంతేకాదు, తెలంగాణ అభివృద్ధి ప్ర‌త్య‌క్షంగా అర్థం కావాలంటే ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఏపీకి ప్ర‌జ‌ల్ని పంపాల‌ని ఆ ఫ్రెండ్ చూచించార‌ట‌. అంత వెట‌కారంగా ఏపీ వెనుక‌బాటుత‌నం గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు మాటలు వింటుంటే ఉద్దేశ పూర్వ‌కంగానే ఏపీకి మ‌రోసారి చంద్ర‌బాబును సీఎం కాకుండా 2019 ఎన్నిక‌ల్లో చేసిన‌ట్టు అనుమానం రాక‌మాన‌దు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గన్ ఏపీని ఏం చేస్తున్నాడో చూడండంటూ తెలంగాణ పాల‌కులు వ్యంగ్యాస్త్రాలు చేయ‌డం స‌గ‌టు ఆంధ్రుడికి క‌డుపుమండేలా చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం 2019 ఎన్నిక‌ల‌కు ముందే టీఆర్ఎస్ లీడ‌ర్లు స్కెచ్ వేశార‌ని అనుమానం క‌లుగు లోంది. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ కు స‌హాయ‌ స‌హ‌కారాలు అందించార‌ని ఇప్పుడు వాళ్ల మాట‌ల ద్వారా ఎవ‌రికైనా బోధ‌ప‌డుతోంది. ఏపీ బాగుంటే, తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాద‌ని టీఆర్ ఎస్ నేత‌ల‌కు ముందే తెలుసన్న‌మాట‌. అందుకే, బాబును ఓడించ‌డానికి సామ‌దాన‌దండోపాయాల‌తో పాటు ఆర్థికంగా కూడా జ‌గ‌న్ కు అండ‌గా నిలిచార‌ని స‌గ‌టు ఏపీ ఓట‌రు ఇప్పుడు అనుకోవ‌డం స‌హ‌జం.

ఆనాడు చంద్ర‌బాబు ఒంగిఒంగి దండాలు పెట్టిన‌ప్ప‌టికీ ఏపీ ఓట‌ర్లు న‌మ్మ‌లేదు. టీఆర్ఎస్ పార్టీ కుట్ర ప‌న్నుతుంద‌ని ప్ర‌చార వేదిక‌ల‌పై చెప్పిన‌ప్ప‌టికీ ఏ మాత్రం బోధ‌ప‌డ‌లేదు.ఏడేళ్లుగా ప‌రిచ‌యం ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ ను ఏపీకి పంపించిన వ్యూహ‌క‌ర్త కూడా కేసీఆరేనేమో అనే సందేహం ఇప్పుడు మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విన్న త‌రువాత అనుమానించాల్సి వ‌స్తుంది. ఇవ‌న్నీ తెలిసే `ప్లీజ్ మ‌రోసారి అవ‌కాశం ఇవ్వండి. ఆ త‌రువాత మీరు ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప‌ర్యాలేదు` అంటూ చంద్ర‌బాబు ప్రాధేయ‌ప‌డినా ఏపీ ఓట‌ర్లు క‌రుణించ‌లేదు. `నాకేం న‌ష్టం లేదు. ఏపీ న‌ష్ట‌పోతుంది. ఆలోచించుకోండి..` అంటూ చంద్ర‌బాబు చెప్పినా చెవికెక్క‌లేదు. ఇప్పుడు తెలంగాణ పాల‌కులు గేలిచేస్తున్న తీరును వింటుంటే స‌గ‌టు ఏపీ ఓట‌రు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ మంత్రి జోగి ర‌మేష్‌, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు స్పందించారు. మ‌ళ్లీ ఉమ్మ‌డి రాష్ట్రం డిమాండ్ వ‌చ్చే వ‌ర‌కు రెచ్చ‌గొట్ట‌ద‌ని మ‌ల్లాది కౌంట‌ర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిని గ్రామాల‌కు వ‌చ్చి చూడాల‌ని జోగి ర‌మేష్ రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద ఏపీ అభివృద్ధిని చెడ‌గొట్ట‌డానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తుంద‌ని 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చెప్పినప్ప‌టికీ చెవికెక్కించుకోని ఏపీ ఓట‌ర్లు ఇప్పుడు ఔరా అంటూ మొఖం వేలాడేసే ప‌రిస్థితికి మంత్రి కేటీఆర్ వెట‌కార‌పు వ్యాఖ్య లు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.