Hindi language : హైదరాబాద్, గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన కేంద్ర రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాష ప్రాముఖ్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా సంభాషణకు ప్రధాన మాధ్యమంగా ఎదిగిన హిందీని అభ్యసించడం అనేది వ్యతిరేకతకు కాదు, అభివృద్ధికి దోహదపడే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఆంగ్ల భాష ఎంత కీలకమో, భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం కూడా అంతే ప్రయోజనకరం. భవిష్యత్‌లో విద్య, వైద్యం, వ్యాపారం మరియు ఉపాధి రంగాల్లో హిందీతో పరిచయం ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
Read Also: Box Office War: 4 వారాల్లో రూ.1200 కోట్లు..ఎంత రాబడతాయో..?
దక్షిణ భారతీయ సినిమాల ఆదాయంలో హిందీ డబ్బింగ్‌కు 31 శాతం వాటా ఉందని గుర్తు చేసిన ఆయన వ్యాపార ప్రయోజనాల కోసం హిందీ అవసరమైతే, నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి? అని ప్రస్తావించారు. భాష ఒక సాధనంగా చూసి, దానిని ఎదుర్కోవడం కన్నా అంగీకరించడం వల్లే దేశాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుందని అన్నారు. తన సినిమాలో “ఏ మేరా జహా” అనే హిందీ పాటను ఉద్దేశపూర్వకంగా చేర్చినట్లు వెల్లడించిన పవన్ తెలుగు నా మాతృభాష అయినా, హిందీ దేశభాష అనే అర్థం చాటడానికి ఆ పాటను వినిపించాను అని తెలిపారు.
హిందీ భాషను నేర్చుకోవడం అనేది మన భాషా గుర్తింపును కోల్పోవడం కాదు, దేశ భాషతో మనల్ని బలంగా అనుసంధానించుకోవడమేనని పవన్ కల్యాణ్ వివరించారు. ఇది ఓటమి కాదు, భాగస్వామ్యం. భవిష్యత్ తరాలకు స్థిరమైన భవిష్యత్తు ఇచ్చే దిశగా తీసుకునే ముందడుగు అని అభిప్రాయపడ్డారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల పట్ల గౌరవాన్ని పునరుద్ఘాటించిన పవన్ “మాతృభాష ఇంట్లో గౌరవాన్ని పొందాలి. దేశం దాటి ప్రయాణించాలంటే హిందీ కావాలి. ఇది మన ఐక్యతకు మూలం అని వివరించారు. హిందీని “పెద్దమ్మ భాష”గా అభివర్ణిస్తూ, దేశవ్యాప్తంగా సామరస్యాన్ని సాధించగల సామర్థ్యం ఆ భాషలో ఉందన్నారు.
భారతదేశ భిన్నతలో ఏకతను హైలైట్ చేస్తూ, దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన విభిన్న రాష్ట్రాల నేతల విశేషాలను పవన్ ఉదహరించారు. బెంగాలీ గీతం జాతీయ గీతంగా అవతరించిందనీ, పంజాబీ ఉద్యమకారులు దేశానికి స్ఫూర్తి కలిగించారనీ, తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందారనీ, రాజస్థాన్‌కి చెందిన రాణప్రతాప్ ధైర్యానికి చిహ్నంగా నిలిచారనీ చెప్పారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన నేత రూపొందించిన త్రివర్ణ పతాకం దేశ జెండాగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి భాషా జీవ భాషే అయినా, భారతదేశాన్ని ఒకతాటిపై నిలిపే రాజ్య భాష మాత్రం హిందీయే అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆ భాషను దేశ ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Liquor Scam Case : దేశంలో అతిపెద్ద మద్యం కుంభకోణం..డెన్‌ల వెనుక దాగిన రహస్యాల పరంపర !