Media Land Mafia : రూ. 14కోట్ల `మీడియా దందా`లోని పెద్ద‌లు ఎవ‌రు?

ప్ర‌స్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయింద‌ని చాలా కాలంగా రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేత‌లు త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేత‌లు డైలీ విరుచుకుప‌డుతుంటారు.

  • Written By:
  • Updated On - August 25, 2022 / 12:19 PM IST

ప్ర‌స్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయింద‌ని చాలా కాలంగా రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేత‌లు త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేత‌లు డైలీ విరుచుకుప‌డుతుంటారు. అంతేకాదు, దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ ఎల్లో మీడియా మీద ప్లీన‌రీ వేదిక‌గా తీర్మానం కూడా చేశారు. ఇక‌, కేసీఆర్ అండ్ టీమ్ చేతుల్లోని ఛాన‌ళ్లు, ప‌త్రిక‌ల‌ను పింక్ మీడియాగా కాంగ్రెస్ చెబుతోంది. జీతాలు ఇవ్వ‌కుండా `బ్లాక్ మెయిల్` చేస్తూ బ‌త‌కాల‌ని విలేక‌రుల‌కు చెప్పే మీడియా హౌస్ లు చాలానే ఉన్నాయి. ఇటీవ‌ల అక్రిటేష‌న్లు రూ. 20 నుంచి రూ. 70వేల వ‌ర‌కు బ‌హిరంగంగా అమ్ముకున్న యాజ‌మాన్యాల కింద ఉన్న మీడియా ను `బ్లాక్ ` లేదా `పిచ్చ‌` మీడియాగా రాజ‌కీయ పార్టీల నేత‌లు మూకుమ్మ‌డిగా విమ‌ర్శించే స్థాయికి దిగ‌జారింది మీడియా. వాళ్లు చేసే విమ‌ర్శ‌ల‌కు బ‌ల‌చేకూరేలా అనంత‌పురం కేంద్రంగా దొర‌లు మాదిరిగా ఇంత‌కాలం తిరిగిన దొంగ విలేక‌రుల దందా బ‌య‌ట‌ప‌డింది. అయితే, ఆయా మీడియా హౌస్ ల్లోని పెద్ద‌ల స‌హ‌కారం లేకుండా కేవ‌లం విలేక‌రులు ఇంత‌ పెద్ద దందా చేయ‌గ‌ల‌రా? అనేది ఇప్పుడు తాజాగా జ‌రుగుతోన్న చ‌ర్చ.
అనంత‌పురం జిల్లాలో ఓ భారీ అక్ర‌మ భూ దందా వెలుగులోకి వ‌చ్చింది. ఈ దందాను ముగ్గురు విలేక‌రులు న‌డిపార‌ని పోలీసులు గ‌మ‌నించారు. వాళ్ల‌కు తోడుగా ఓ డ్రైవ‌ర్ సహ‌కారం ఉంద‌ని గుర్తించి వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డంతో దందా బ‌హిర్గ‌తం అయింది. స్థానిక కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా ఆ న‌లుగురికి న్యాయ‌మూర్తి రిమాండ్ విధించారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధికారిక సోష‌ల్ మీడియాల వ‌రుస ట్వీట్ల ను చేస్తోంది.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం భూ దందాకు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి వాటిని ఉప‌యెగించారు. వాటి ఆధారంగా 14.96 ఎకరాల భూమిని య‌జ‌మానికి తెలియ‌కుండా మరొకరికి విక్రయించారు. అంతేకాదు, ప‌క్కాగా కొనుగోలుదారుడి పేరిట‌ రిజిస్ట్రేషన్ కూడా చేయించ‌డం హైలెట్ పాయింట్‌. ఈ కేసును పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ మరియు సాక్షి విలేఖర్లు పాత్ర‌ధారులుగా తేలింది. ఆ విష‌యాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్టారు.

దందా వెనుక సూత్ర‌ధారులుగా ఉన్న ఆయా మీడియాల్లోని కొంద‌రు పెద్ద‌ల ప్ర‌మేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే రూ.75 లక్షలు చేతులు మారాయ‌ని టీడీపీ సోషల్ మీడియా వెలుగెత్తి చాటుతోంది. ప్ర‌స్తుతం బ్లూ మీడియాను ప‌ట్టుకున్న టీడీపీ నానా యాగీ చేస్తోంది. ప్ర‌తిగా ఎల్లో మీడియా వ్య‌వ‌హారాల‌పై ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టిందట‌. పింక్ మీడియాను కాంగ్రెస్ లోని కొంద‌రు నేత‌లు త‌ప్ప ఎవ‌రూ ఎదిరించే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఇక నాలుగో ర‌కం బ్లాక్ అలియాస్ పిచ్చి మీడియా యాజ‌మాన్యం స‌మాజాన్ని పీక్కుతినే ప‌నిలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు లైట్ గా తీసుకోవ‌డం గ‌మనార్హం.
మొత్తం మీద 14కోట్ల డీల్ ను సెట్ చేసిన విలేక‌రుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ల వెనుక పాత్ర‌దారులుగా ఉన్న పెద్ద‌ల‌ను వెలిగితీస్తారా? లేదా అనేది చూడాలి.