Site icon HashtagU Telugu

Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు!

Land acquisition for aerospace park in Karnataka cancelled..new opportunities for Andhra Pradesh!

Land acquisition for aerospace park in Karnataka cancelled..new opportunities for Andhra Pradesh!

Aerospace Park : కర్ణాటక ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావాలనుకున్న ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రైతుల నుంచి భారీ స్థాయిలో భూసేకరణపై తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తడంతో, ఈ ప్రాజెక్టును రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేస్తూ, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 1,777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాలన్న తుది నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ భూసేకరణ ప్రతిపాదనలకు 1,000 రోజులుగా పైగా కొనసాగుతున్న రైతుల నిరసనలు ముద్రపడిన నేపథ్యంలో, విధాన సౌధలో రైతు సంఘాల నేతలతో సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. చెన్నరాయపట్టణ, దేవనహళ్లి తాలూకాలోని పలు గ్రామాల్లో భూసేకరణ పూర్తిగా విరమించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కొందరు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ, తాము భూమి ఇవ్వడానికి ఇష్టపడని రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ, వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించేందుకు అవకాశమిస్తామని వెల్లడించారు.

ఇదే సమయంలో ఈ అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టిడిపి-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు. బెంగళూరుకు సమీపంలోనే అంటే రాష్ట్రానికి సరిహద్దులో 8,000 ఎకరాలకు పైగా భూమి వినియోగానికి సిద్ధంగా ఉందని తెలిపారు. త్వరలో ఏరోస్పేస్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో, దేశీయంగా ఏరోస్పేస్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. కర్ణాటక రైతుల మనోభావాలను గౌరవించిన సిద్ధరామయ్య నిర్ణయం ఒకవైపు ప్రశంసలందుకుంటున్నదే, మరోవైపు అది ఏపీకి పరిశ్రమల ఆకర్షణలో ఓ అనూహ్య అవకాశాన్ని తెరలేపింది. ఈ నిర్ణయం పరిశ్రమల వృద్ధికి, రైతుల సంక్షేమానికి మధ్య సమతౌల్యం ఎలా సాధ్యమవుతుందో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు తీసుకురావచ్చో గమనించాల్సి ఉంది.

ఈ పరిణామం పట్ల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..సిద్దరామయ్య మాట నిలబెట్టుకున్నారు. సామాజిక న్యాయాన్ని కేవలం మాట్లాడటమే కాకుండా, ఆచరణలో చూపారు అని ప్రశంసించారు. ఈ మొత్తం పరిణామం ఒక్క భూసేకరణ వెనక్కు తగ్గడమే కాకుండా, పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్రాల మధ్య పెరుగుతున్న పోటీని, అలాగే భూమి మరియు రైతుల పట్ల ప్రభుత్వాల మద్దతు విధానాల మధ్య గల సమతుల్యత అవసరాన్ని స్పష్టంగా చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ అవకాశాన్ని తమకిష్టమైన దిశగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు రైతుల ఆవేదనను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం, ఇటు పరిశ్రమల ఆకర్షణ కోసం పావులు కదుపుతున్న ఆంధ్ర ప్రభుత్వం — ఈ రెండు రాష్టాల చర్యలు పరస్పరంగా ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Mithun Reddy : మిథున్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ..లుక్‌ఔట్ నోటీసులు జారీ