AP – TS : వైసీపీలోకి ల‌క్ష్మీనారాయ‌ణ‌? స‌జ్జ‌లకు`వీవీ` తందానా!

ఏపీ, తెలంగాణ(AP,TS) మ‌ళ్లీ క‌లుస్తాయా? ఉమ్మ‌డి ఏపీ తిరిగి సాకారం అవుతుందా? ఎందుకు రాజ‌కీయాల్లో త‌ర‌చూ ఈ అంశం తెర‌మీద‌కు వ‌స్తుంది?

  • Written By:
  • Updated On - December 9, 2022 / 03:07 PM IST

ఏపీ, తెలంగాణ (AP, TS) మ‌ళ్లీ క‌లుస్తాయా? ఉమ్మ‌డి ఏపీ తిరిగి సాకారం అవుతుందా? ఎందుకు రాజ‌కీయాల్లో త‌ర‌చూ ఈ అంశం తెర‌మీద‌కు వ‌స్తుంది? ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను మ‌ళ్లీ రెచ్చ‌గొట్ట‌డం ఎందుకు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తావిస్తూ ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల(Sajjala) రామ‌క్రిష్ణారెడ్డి తాజా వ్యాఖ్య‌లు తెర‌లేపాయి.  ఏపీ, తెలంగాణ(AP,TS)  తిరిగి క‌లుస్తాయ‌ని సెంటిమెంట్ ను   రాజేస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యాణం ఎటో ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. భావ‌జాలానికి అనుగుణంగా ఉన్న పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌కూ ఆయ‌న భావ‌జాలంకు అనుగుణంగా ఉండే పార్టీ ఏది? సజ్జ‌ల(Sajjala) వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ధ‌తుగా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడ‌డాన్ని గ‌మ‌నిస్తే ఆయ‌న జై జ‌గ‌న్ అంటారా? అనే అనుమానం క‌లుగుతోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల వ్య‌వ‌హారంపై తొలి రోజుల్లో సీబీఐ డైరెక్ట‌ర్ గా ల‌క్ష్మీనారాయ‌ణ విచారించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న హీరోగా ఫోక‌స్ అయ్యారు. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `క్విడ్ ప్రో కో` కేసుల వ్య‌వ‌హారానికి విచాణాధికారిగా ఉండ‌డమే ఆయ‌న జీవితంలోని ట‌ర్నింగ్ పాయింట్. తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ డైరెక్ట‌ర్ ఐదేళ్ల పాటు ఆయ‌న పేరు నానింది. దాన్ని హీరోయిజంగా భావిస్తూ ఆయ‌న రాజ‌కీయాల్లోకి దిగార‌ని ఇప్ప‌టికీ కొంద‌రు విమ‌ర్శిస్తుంటారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి రోజుల్లో కొత్త పార్టీ పెడ‌తార‌ని టాక్ న‌డిచింది. ఆ త‌రువాత రైతుల‌తో మ‌మేకం అవుతూ కొన్ని రోజులు హ‌డావుడి చేశారు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా టీడీపీ హామీ ఇస్తూ ఆయ‌న్ను టీడీపీలోకి ఆహ్వానించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే, సామాజిక‌వ‌ర్గం ప‌రంగా అనుకూలంగా ఉండే జ‌న‌సేన పార్టీ గూటికి చేరారు. విశాఖ ఎంపీగా పోటీ చేసి 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ త‌రువాత పార్టీ చీఫ్ వైఖ‌రి, సిద్దాంతాలు న‌చ్చ‌క దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను వైసీపీ సిద్ధాంతాలు ఆక‌ర్షించిన‌ట్టు క‌నిపిస్తోంది. పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌నకు సానుకూలంగా ఇటీవ‌ల ఆయ‌న వాయిస్ ఉంది. తాజాగా స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ధ‌తు ఇస్తూ ఏపీ, తెలంగాణ క‌లిస్తే మంచిద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో రాష్ట్ర విభ‌జ‌న బిల్లుపై పిటిష‌న్లు పెండింగ్ లో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 22న దానిపై వాద‌న ప్రారంభం అవుతోంది. ఆ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అందులో విభ‌జ‌న అంశాన్ని లైట్ గా తీసుకుంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అఫిడ‌విట్ వేయ‌డాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అభ్యంత‌ర పెట్టారు. దానిపై ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు స‌మైక్యంగా ఉండాల‌ని వైసీపీ సిద్ధాంత‌మ‌ని ప్ర‌క‌టించారు. రెండు రాష్ట్రాల‌ను క‌లిపితే మంచిదంటూ ల‌క్ష్మీనారాయ‌ణ మ‌ద్ధ‌తు ప‌లికారు. స‌రిగ్గా ఇక్క‌డే ఆయ‌న వైసీపీ గూటికి చేర‌తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

జ‌న‌సేన పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత రాజ‌కీయ పార్టీల‌కు ల‌క్ష్మీనారాయ‌ణ దూరంగా ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి జ‌న‌సేన నుంచి పోటీ చేయ‌డానికి అవ‌కాశం దాదాపుగా లేదు. ఎందుకంటే జ‌న‌సేన సిద్ధాంతాలు స‌రిగా లేవ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చారు. పైగా ప‌వ‌న్ నాన్ సీరియ‌స్ పొలిషియ‌న్ గా ఆయ‌న భావిస్తుంటారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఆయ‌న్ను తీసుకోవ‌డానికి అవ‌కాశం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే విశాఖ ఎంపీగా బాల‌క్రిష్ణ అల్లుడు శ్రీభ‌ర‌త్ టీడీపీ త‌ర‌పు పోటీ చేయ‌నున్నారు. సో..విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటోన్న ల‌క్ష్మీనారాయ‌ణ‌కు టీడీపీ అవ‌కాశం ఇవ్వ‌దు. ఇక మిగిలిన పార్టీ వైసీపీ మాత్ర‌మే. పైగా స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం, మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా మాట్లాడ‌డం త‌దిత‌రాలు ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో చేర‌బోతున్నారని భావించ‌డానికి ఉండే లాజిక్స్. అదే జ‌రిగితే, ఒక నిందితుడు పార్టీలో విచార‌ణాధికారి చేరిన చ‌రిత్ర రికార్డ్ ల్లోకి ఎక్క‌నుంది.

ఇక ఏపీ, తెలంగాణ తిరిగి క‌ల‌వాలంటే రాజ్యాంగం ప్ర‌కారం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆమోదించాలి. ఏపీ అసెంబ్లీలోనూ ఆమోదం పొందాలి. ఆ త‌రువాత పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ఆ బిల్లు ఆమోదం పొంద‌డం అవ‌స‌రం. సుప్రీం కోర్డులో విభ‌జ‌న బిల్లు వాద‌న‌ల‌కు సిద్ధంగా ఉన్నంత మాత్రాన ఆ బిల్లు చెల్ల‌ద‌ని చెప్ప‌డానికి అవ‌కాశం లేదు. అంతేకాదు, ఆ రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆవిర్భావం కావ‌డంతో పాటు రాజ్యాంగం ప్ర‌కారం ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వాలు కొన‌సాగుతోన్న క్ర‌మంలో మ‌ళ్లీ క‌ల‌పండ‌ని చెప్ప‌డానికి అవ‌కాశమే లేదు. ఇలాంటి అంశాన్ని తీసుకుని వైసీపీ మాట్లాడుతుంటే దానికి టీఆర్ఎస్ స్పందించ‌డం మ‌ధ్య ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి వాళ్లు మీడియాలో స‌జ్జ‌ల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం హాస్యాస్ప‌దం. రాజ‌కీయంగా రాష్ట్ర విభ‌జ‌న బిల్లును ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు వాడుకుంటున్నార‌ని చెప్ప‌డానికి ఇదో నిద‌ర్శ‌నం.