రెండు తెలుగురాష్ట్రాల్లో సర్వేల పేరుతో సంచలనాలు సృష్టించి ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన మాజీ ఎంపీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సర్వేలు పేరుతో తెరమీదకి వచ్చిన ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. మీడియాకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు గెలిచారు. ఎంపీగా లగడపాటి రాజగోపాల్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. విభజన తరువాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని కోల్పోవడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికే ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని.. ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆయనకు సమాచారం పంపినట్లు తెలుస్తుంది. అయితే ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారా లేదా మరో లోక్‌సభ స్థానానికి వెళ్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీలో మాత్రం విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాల్లో బలమైన పట్టు కలిగి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ హవా సాగిన ఈ రెండు పార్లమెంట్‌లను టీడీపీ గెలిచింది. విజయవాడ నుంచి ఎంపీగా కేశినేని శ్రీనివాస్(నాని), గుంటూరు నుంచి ఎంపీగా గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఇప్పుడు ఈ రెండు నియోజవకర్గాల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని గతంలో పోటీ చేయనని చెప్పినప్పటికి..గత కొద్దినెలలుగా ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు ఎంపీగా మాత్రం గల్లా జయదేవ్ పోటీ చేయరనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన స్థానంలోనే లగడపాటిని బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. దీనికి లగడపాటి రాజగోపాల్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
