Site icon HashtagU Telugu

TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ

Laddu controversy.. YS Jagan letter to the Prime Minister

Laddu controversy.. YS Jagan letter to the Prime Minister

Laddu Controversy: తిరుమల తిరుపతి శ్రీ వారి లడ్డూ వివాదంపై వైఎస్‌ జగన్‌ ప్రధాని మోడీకి లేఖ రాశారు. టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీపై కేంద్రమే విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. దేవుడి పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకు అవాస్తవాలు ప్రచారం..

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్ఠను దెబ్బతీయడంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామికి భారతదేశం మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని, ఈ పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు టీటీడీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాద తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నారనే ఆరోపణలు అసత్యమని, ప్రతి ట్యాంకర్‌ని కఠినంగా పరిశీలించేవారని, నాసిరకం నెయ్యి గుదుగుంటే తిప్పిపంపుతారని స్పష్టం చేశారు.

సీఎం వ్యవహరించిన తీరు అసమాజోచితం..

వైసీపీ పాలనలో 18 సార్లు నాణ్యత లేని ట్యాంకర్లు తిరస్కరణకు గురయ్యాయని, కల్తీ నెయ్యి ప్రసాద తయారీలోకి రావడం అసాధ్యమని తెలిపారు. ఈ విధానం గత కొద్దీ దశాబ్దాలుగా అమలులో ఉందని, టీటీడీ పనితీరుపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు పటిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందన్నారు. ఈ అంశంలో సీఎం వ్యవహరించిన తీరు అసమాజోచితమని, దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

ప్రసాదాల తయారీలో టీటీడీ దశాబ్దాల కాలంగా నియమ, నిబంధనలు..

జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జులై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, అందులో జంతువుల కొవ్వు కలిసి ఉందంటూ రిపోర్ట్ రావడంతో టీటీడీ దాన్ని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించలేదని వివరించారు. అయినప్పటికీ- చంద్రబాబు తన అసత్య ప్రచారాలను మాత్రం మానుకోలేదని జగన్ చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీలో టీటీడీ దశాబ్దాల కాలంగా నియమ, నిబంధనలను అనుసరిస్తోందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫారసు చేసిన ప్రముఖులను టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

అప్పట్లో ప్రైవేటు సంస్థలే నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి..

ఇప్పుడున్న టీటీడీ బోర్డులో కూడా కొందరు బీజేపీ నాయకులు ఉన్నారని జగన్ తెలిపారు. స్వతంత్రంగా వ్యవహరించే పాలక మండలి కావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఇందులో నామమాత్రంగా ఉంటుందని, పాలక మండలి భక్తుల ప్రయోజనాల కోసం సొంతంగా నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015- 2018 మధ్యకాలంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్.. తిరుమలకు నెయ్యి సరఫరాను నిలిపివేసిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అప్పట్లో ప్రైవేటు సంస్థలే నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయని అన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వ హయాంలోనూ కొన్ని రోజులు కేఎంఎఫ్ నెయ్యిని పంపించలేదని పేర్కొన్నారు.

తనకు బాగా అలవాటైన రీతిలో చంద్రబాబు చివరికి తిరుమలను సైతం తన రాజకీయాల కోసం వాడుకుంటోన్నారని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించట్లేదని జగన్ ఆరోపించారు. ఈ కీలక పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా మీ వైపే చూస్తోందని, చంద్రబాబు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని దేశ ప్రజలు కోరుకుంటోన్నారని చెప్పారు.

Read Also: Kidney Stones: ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలు కిడ్నీలో స్టోన్స్ ఇట్టే కరిగిపోవడం ఖాయం!