Kurnool Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) దేశవ్యాప్తంగా విషాదం నింపింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ‘వేమూరి కావేరీ’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయినట్లుగా తెలుస్తోంది.
ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), ఆయన భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు. బెంగళూరులో స్థిరపడిన ఈ కుటుంబం హైదరాబాద్ వెళ్లి తిరిగి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో మరణించారు. వీరి మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాద వివరాలు
బస్సు పటాన్ చెరులో రాత్రి 9.30 గంటల సమయంలో బయలుదేరి, హైదరాబాద్‌లోని వివిధ స్టాపుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరింది. చిన్నటేకూరు వద్ద బస్సు కింద ఒక ద్విచక్ర వాహనం చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారని, కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారని స్థానికులు చెబుతున్నారు. బస్సులో చిక్కుకున్న 25 మందికి పైగా ప్రయాణికులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది.
సంచలన విషయాలు వెలుగులోకి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ‘వేమూరి కావేరీ’ ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసింది. అంతేకాక ఈ బస్సు ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ముగిశాయి. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన బస్సును నడపడం, అతివేగం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
