కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు, అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల వివరాలను తెలుసుకుని.. వారి కుటుంబాలకు వెంటనే సహాయం అందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులను ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లోనూ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా.. ఈ బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం మరణించగా.. బాపట్ల జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన ధాత్రి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. దీపావళికి ఇంటికి వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి గురువారం రాత్రి బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కింది. ప్రమాదం నుంచి బయటపడలేక బస్సులోనే సజీవ దహనమయింది
