Kuppam: చంద్ర‌బాబు రాజ్యంలో పుంగ‌నూరు రెడ్డి!

ప్ర‌ధాన మంత్రి కంటే పంచాయతీ స‌ర్పంచ్ కావ‌డం చాలా క‌ష్ట‌మంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే, పంచాయ‌తీ ఎన్నిక‌లపై ప్ర‌భావితం చూపే అంశాల మూలాలు వేరు.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 04:39 PM IST

ప్ర‌ధాన మంత్రి కంటే పంచాయతీ స‌ర్పంచ్ కావ‌డం చాలా క‌ష్ట‌మంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే, పంచాయ‌తీ ఎన్నిక‌లపై ప్ర‌భావితం చూపే అంశాల మూలాలు వేరు. ప్ర‌ధాన మంత్రి అయ్యేందుకు అవ‌స‌ర‌మైన అంశాలు స‌ప‌రేటు. ఈ రెంటినీ పోల్చి చూడ కూడ‌దు. ఒక ఎన్నిక‌కు మ‌రో ఎన్నిక‌ను పోల్చ‌లేం. అలాగే, స్థానికంగా ఓడినంత మాత్రానా ఆ నాయ‌కుడు ప‌నికిరాడ‌ని చెప్ప‌లేం. పాలకొల్లు ప్రాంతానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి 2009లో అక్క‌డ ఓడిపోయాడు. అదే తిరుప‌తిలో గెలిచాడు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉండే భీవ‌వ‌రంలోనూ, గాజువాక‌లోనూ ఓడిపోయాడు. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో టీడీపీ పాగా వేసిన సంద‌ర్భాలు అనేకం.

తాజాగా ఏపీలో జ‌రిగిన ఒక కార్పొరేష‌న్‌తో స‌హా 12 మున్సిపాలిటిల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఉండే ప్రాంతంలో వైసీపీ వెనుక‌బ‌డింది. మోజార్టీ స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకున్న‌ప్ప‌టికీ టీడీపీ బ‌ల‌మైన పోటీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు గెలిచిన చోట ఆయా ప్రాంతాల్లోని వైసీపీ నాయ‌కులు ఇక రాజ‌కీయాల‌కు ప‌నికిరార‌ని అనుకోలేం. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి మున్సిపాలిటీ టీడీపీ కైవ‌సం చేసుకుంది. అంత మాత్ర‌న అక్క‌డి మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఇక రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని చెప్ప‌లేం. అలాగే, కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచినంత మాత్ర‌న చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయం ఇక అయిపోయింద‌ని అనుకోలేం. ఈ ఫ‌లితం కేవ‌లం ఆయ‌న్ను రాజ‌కీయంగా టార్గెట్ చేయ‌డానికి కొన్ని రోజులు పనికి వ‌స్తుంది.

మున్సిపల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కుప్పంపై తొలి నుంచి అధికారం ఉన్న వైసీపీ ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెట్టింది. సామ‌దాన‌దండోపాయాల‌ను ఓట‌ర్ల మీద, పోటీ చేసిన అభ్య‌ర్థుల మీద ప్ర‌యోగించింది. అంతేకాదు, పరిస‌ర ప్రాంతాల నుంచి దొంగ ఓట‌ర్ల‌ను త‌ర‌లించార‌ని టీడీపీ ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టింది. అభ్య‌ర్థుల‌ను కిడ్నాప్ చేసే ప్ర‌య‌త్నం వైసీపీ చేసింది. ఇలా..ప‌లు ర‌కాల ప్ర‌లోభాల‌కు ఓట‌ర్ల‌ను, ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థుల‌ను గురి చేసింది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయిన‌ప్ప‌టికీ గెలుపు కోసం ప్ర‌లోభాల‌ను ప్ర‌యోగించ‌డం సర్వ‌సాధార‌ణం. ఈసారి వైసీపీ చంద్ర‌బాబు టార్గెట్ అనేలా కుప్పం మీద హ‌ద్దుల దాటి రాజ‌కీయ యుద్ధం చేసి గెలిచింది. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయ వైరం చాలా కాలంగా ఉంది. కొన్ని ద‌శాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో ఇద్ద‌రూ రాజ‌కీయం చేస్తున్నారు. 2014, 2019 ఎన్నిక‌ల నుంచి ఇరువురి మ‌ధ్యా వ్య‌క్తిగ‌త రాజ‌కీయ వైరం మొద‌లైయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం ఎమ్మెల్యేగా చంద్ర‌బాబును ఓడించాల‌నే టార్గెట్ దిశ‌గా పెద్దిరెడ్డి వెళుతున్నాడు.

అంతేకాదు, బాబును ఓడించ‌క‌పోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఇప్ప‌టి నుంచే అంటున్నాడు. అంటే, వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు మీద రామ‌చంద్రారెడ్డికి ఎంత క‌సి ఉందో అర్థం అవుతుంది. కానీ, రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేం. బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు అయిన రోజుల‌ను చూశాం. మ‌రి, పెద్దిరెడ్డి శ‌ప‌థం కేవ‌లం కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ‌ర‌కేనా..సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా? అనేది చూడాలి.