ఆ న‌లుగురు!కాబోయే సీఎంలు!!

కాబోయే ముఖ్య‌మంత్రులుగా కేటీఆర్‌, లోకేష్, ప‌వ‌న్‌, రేవంత్ చాలా కాలంగా ఫోక‌స్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 10, 2021 / 03:34 PM IST

కాబోయే ముఖ్య‌మంత్రులుగా కేటీఆర్‌, లోకేష్, ప‌వ‌న్‌, రేవంత్ చాలా కాలంగా ఫోక‌స్ అవుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆ స్లోగ‌న్ కొంచం స్లో అయింది. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు వాళ్ల ల‌క్ష్యాన్ని వెనక్కు నెట్టాయ‌ని అనిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌ని ద్రాక్ష మాదిరిగా కేటీఆర్ కు సీఎం ప‌ద‌వి ఉంది. రెండేళ్ల క్రితమే తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు త్వ‌ర‌లో ప‌ట్టాభిషేకం అంటూ ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల‌ను చూశాం. ఎప్ప‌టిక‌ప్పుడు అలాంటి ప్ర‌చారం ఊపందుకున్న‌ప్పుడ‌ల్లా సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా చ‌ల్ల‌బ‌రుస్తున్నాడు.ఇక నారా లోకేష్‌ కాబోయే సీఎం అంటూ 2016వ ఏడాది నుంచి స్లాగ‌న్ మొద‌లయ్యింది. ఆ స్లోగ‌న్ 2019 నాటికి బాగా బ‌ల‌ప‌డింది. పార్టీలోని కీలక లీడ‌ర్లుగా ప్ర‌స్తుతం కనిపిస్తోన్న బుద్ధా వెంక‌న్న‌, బాబూరాజేంద్ర‌ప్రసాద్‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు, వ‌ర్ల రామ‌య్య త‌దిత‌రులు పోటీప‌డి కాబోయే సీఎం లోకేష్ అంటూ మీడియా ఎదుట వినిపించారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ లాంటి వాళ్లు ప్ర‌తి వేదిక మీదా ఇదే మాట‌ను బ‌ల్ల‌గుద్ది చెప్పారు. కాబోయే సీఎం లోకేష్ అంటూ ఏపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఆనాడు బాగా వెళ్లింది. కాక‌పోతే, అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేల‌కు ప‌రిమితం అయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 2024 ఎన్నిక‌ల నాటికి సీఎం అభ్య‌ర్థిగా లోకేష్ ను ఫోక‌స్ చేయ‌డం మానుకోవాల‌ని పార్టీలోని కొంద‌రు భావిస్తున్నార‌ట‌. కానీ, మీడియా అధిప‌తులు ఒక‌రిద్ద‌రు లోకేష్ ను కాబోయే సీఎంగా తీర్చిదిద్దాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

జ‌న‌సేనాని ప‌వ‌న్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఇద్ద‌రూ ఒకే విధ‌మైన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు క‌నిపిస్తోంది. వీళ్లిద్ద‌రూ స‌భ‌లు, స‌మావేశాలు ఎక్క‌డ పెట్టిన‌ప్ప‌టికీ వాళ్ల అభిమానులు కొంద‌రు సీఎం..సీఎం…అంటూ నినాదాలు చేయ‌డం ప‌రిపాటి అయింది. పీసీసీ చీఫ్ అయిన తొలి రోజుల్లో సీఎం..సీఎం..అంటూ రేవంత్ స‌భ‌ల్లో వినిపించ‌డం ఆ పార్టీలోని సీనియ‌ర్ల‌కు ఒళ్లుమండేలా చేసింది. అంతేకాదు, ఆ స్లోగ‌న్ల‌ను ఢిల్లీ వ‌ర‌కు సీనియ‌ర్లు తీసుకెళ్లారు. దీంతో ఇటీవ‌ల స‌భ‌ల్లో రేవంత్‌కు చ‌ప్ప‌ట్లుగానీ, సీఎం..సీఎం..అంటూ నినాదాలుగానీ దూరం అయ్యాయి. కాబోయే సీఎంగా ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెప్పుకోవ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయ్యాడు.బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ పేరును ఇటీవ‌ల వీర్రాజు ప్ర‌క‌టించాడు. దీంతో ఇక కాబోయే సీఎం ప‌వ‌న్ అంటూ ఆయ‌న అభిమానులు సంబ‌ర‌ప‌డ్డారు. తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఆ స్లోగ‌న్ కాస్త‌..వెనుక‌బ‌డింది. అంతేకాదు, ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాలు కూడా ఆ స్లోగ‌న్ కు అనుకూలంగా కనిపించ‌డంలేదు.

అమ‌రావ‌తి రైతుల‌తో క‌లిసి న‌డిచిన బీజేపీ రాబోయే రోజుల్లో టీడీపీతో పొత్తు దిశ‌గా వెళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి వెళ్లే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా ఆ మూడు పార్టీల ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా చంద్ర‌బాబునాయుడు ఉంటాడు. సో..కాబోయే సీఎంగా ప‌వ‌న్ మిగిలిపోతాడ‌న్న‌మాట‌.రెండు తెలుగు రాష్ట్రాలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేటీఆర్, లోకేష్‌, ప‌వ‌న్‌, రేవంత్ కాబోయే సీఎంలుగా మాత్ర‌మే ప‌రిమితం అవుతారా? నిజంగా ఆ ప‌ద‌వి వాళ్ల‌కు దక్కుతుందా? అనే పశ్న‌ల‌కు కాలం స‌మాధానం చెప్పాల్సిందే.!