Site icon HashtagU Telugu

Krishna River Floods : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రహదారులు, గ్రామాలు ముంపులో

Krishna River

Krishna River

Krishna River Floods : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులు ఆగ్రహరూపం దాల్చడంతో లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలో కలుస్తోంది. అంచనాల ప్రకారం ప్రస్తుతం రెండు నదుల నుంచీ కలిపి దాదాపు 15 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఇందులో కృష్ణా నది నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.

Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

కృష్ణా వరదల ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గురువారం ఉదయానికి ఇన్‌ఫ్లో 5,05,976 క్యూసెక్కులకు చేరగా, అదే మొత్తంలో నీటిని అధికారులు డౌన్‌స్ట్రీమ్‌కి వదులుతున్నారు. వరద ఉధృతి కొనసాగుతున్నందున బ్యారేజీ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు గోదావరి ఆగ్రహం ప్రదర్శిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు 48 అడుగులుగా నమోదైన నీటి మట్టం, గురువారం ఉదయానికి 50.8 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం పరిసర రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. కల్యాణ కట్ట ప్రాంతం వరకూ గోదావరి నీరు చేరింది. స్నానఘట్టాల మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

గోదావరి డౌన్‌స్ట్రీమ్‌లోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా భారీ వరదనీరు చేరుతోంది. గురువారం ఉదయానికి 9,84,339 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, అదే మొత్తాన్ని అధికారులు సముద్రం వైపు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 11.9 అడుగులుగా నమోదైంది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు రక్షణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Excise Policy : తెలంగాణలో డిసెంబర్ 01 నుండి కొత్త మద్యం షాపులు