మహానేత, రాజకీయ అజాతశత్రువు కొణిజేటి రోశయ్య అస్తమించాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న ఆయన 1933 జూలై 4న జన్మించాడు. గుంటూరు జిల్లా వేమూరు ఆయన స్వస్థలం. గుంటూరులోని హిందూకాలేజిలో ఆయన కామర్స్ విభాగంలో గ్రాడ్యేయేట్ చేశాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, కర్షక నాయకునిగా పేరుంది. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రామానీడు రైతు విశ్వవిద్యాలయంలో తిమ్మారెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1968, 1974, 1980 సంవత్సరాల్లో మూడుసార్లు ఉమ్మడి ఏపీ శాసన మండలి సభ్యునిగా ఉన్నాడు. తొలిసారిగా చెన్నారెడ్డి క్యాబినెట్ లో రోడ్లు, భవనాలు, రవాణశాఖ మంత్రిగా పనిచేశాడు.
పలువురు ముఖ్యమంత్రుల వద్ద కీలకమైన శాఖలను నిర్వహించాడు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పనిచేశాడు. విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో 1982లో హోం శాఖ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాడు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు చేపట్టాడు. 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా చేశారు. 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Rosiah 2
1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేసిన రాజకీయవేత్త ఆయన. నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు 1998లో ఎన్నికయ్యాడు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. ఆ ఏడాది శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా కీలక సమయంలో ఉన్నాడు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా నియమింపబడ్డాడు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. ఇటీవల ఆనారోగ్యంతో బాధ పడుతోన్న రోశయ్యకు హఠాత్తుగా ఇవాళ బీపీ పడిపోయింది. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన స్వర్గస్తులయ్యాడు. సుమారు 89 సంవత్సరాల వయస్సున రోశయ్య ఏ ఒక్కరికీ వివాదస్పద కాకుండా సుదీర్ఘ రాజకీయాలను నడిపాడు. భౌతికంగా దూరం అయినప్పటికీ రోశయ్య లాంటి రాజకీయవేత్తను ఎవరూ మరువలేరు.