Konaseema Incident : ఏపీ ఓ శ్రీలంక‌..కోన‌సీమ మ‌రో క‌శ్మీర్ !

ప్ర‌జ‌ల‌కు బ‌లంగా ఏదైనా ఒక సంఘ‌ట‌న వెళ్లాంటే ఉప‌మానంగా ఏదో ఒక దాన్ని తీసుకుంటారు.

  • Written By:
  • Updated On - May 31, 2022 / 03:44 PM IST

ప్ర‌జ‌ల‌కు బ‌లంగా ఏదైనా ఒక సంఘ‌ట‌న వెళ్లాంటే ఉప‌మానంగా ఏదో ఒక దాన్ని తీసుకుంటారు. కోన‌సీమ అంబేద్క‌ర్ జిల్లా విధ్వంసాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి క‌శ్మీర్‌ను చంద్ర‌బాబు నాయుడు ఉదాహ‌ర‌ణ‌గా తీసుకున్నారు. ఉగ్ర‌వాదాన్ని అదుపు చేయ‌డానికి త‌ర‌చూ క‌శ్మీర్ వాలీలో ఇంట‌ర్ నెట్‌, సెల్ ఫోన్ల సిగ్న‌ల్స్ క‌ట్ చేస్తుంటారు. జ‌మ్యూ, క‌శ్మీర్ ప్రాంతాల్లో రాక‌పోక‌ల‌ను నియంత్రించ‌డంతో పాటు బాహ్య ప్ర‌పంచానికి దూరంగా ఆ ప్రాంతాల‌ను ఉంచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇప్పుడు కోన‌సీమ అంబేద్క‌ర్ జిల్లాలోనూ అలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. కోన‌సీమ‌ను మ‌రో క‌శ్మీర్ గా పోల్చారు.

కోన‌సీమ ప్రాంతంలో జ‌రిగిన అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను వారం క్రితం నిలిపివేశారు. బాహ్య ప్ర‌పంచంతో సంబంధం లేకుండా కొన్ని రోజుల నుంచి కోన‌సీమ‌ను అక్క‌డి పోలీసులను ఉంచారు. ఫ‌లితంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌తో పాటు వ్యాపార సంస్థ‌లు నిర్వ‌హ‌ణ క‌ష్టంగా మారింది. ఇత‌ర ప్రాంతాల నుంచి కోన‌సీమ‌కు ప్ర‌యాణించే వాళ్ల‌ను నిశితంగా పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. విధ్వంసానికి పాల్ప‌డిన వాళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ వారం నుంచి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేదు. ఆ రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. `ఎక్కడో కశ్మీర్ లో వినిపించే ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే వార్తను మనం మన సీమలో వినాల్సి రావడం బాధాకరమని బాబు అన్నారు.

ఐటీ వంటి ఉద్యోగాలను ఇవ్వలేని ఈ ప్రభుత్వం, కనీసం వాళ్లు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని గుర్తు చేశారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా ఇంటర్నెట్ ఆధారంగా నడిచే ఈ రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ఆయన ట్విట్ట‌ర్ ద్వారా డిమాండ్ చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఏపీ ఆర్థిక ప‌రిస్థితుల‌తో పోల్చుతూ ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఆ దేశంలోని ప‌రిస్థితులు ఏపీలో ఉన్నాయ‌ని ఆ రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు టీడీపీ బ‌లంగా తీసుకెళ్లింది. అంతేకాదు, రాబోవు రోజుల్లో శ్రీలంక ప్ర‌ధానికి ప‌ట్టిన గ‌తే జ‌గ‌న్ కు ప‌డుతుంద‌ని అక్క‌డ జ‌రిగిన లూటీల‌ను గుర్తు చేశారు. తాజాగా కోన‌సీమ విధ్వంసాన్ని కాశ్మీర్ తో పోల్చుతూ ఏపీలోని కోన‌సీమ దుస్థితిని అంద‌రికీ అర్థం అయ్యేలా చంద్ర‌బాబు ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.