Konapapapeta : ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ఊరు క్రమంగా సముద్రంలో మునిగిపోతోంది. ఇప్పటికే వందలాది ఇళ్లు సముద్రంలో మునిగాయి. ఫలితంగా వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ ఊరి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?
- కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట గ్రామం జనాభా దాదాపు 4వేలు.
- ఈ ఊరిలోని భూభాగం ఏటా సముద్ర జలాల ఆటుపోట్ల వల్ల తీవ్ర కోతకు గురవుతోంది.
- గత రెండేళ్ల వ్యవధిలో ఈ ఊరి(Konapapapeta)లోని భూభాగం దాదాపు 50 మీటర్ల మేర సముద్రంలో కలిసిపోయింది. అంటే అంతమేర సముద్రం ముందుకు కదిలి వచ్చింది.
- ఊరిలోని భూభాగం సముద్రంలో కలిసిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
- గత రెండు నెలల్లో పలు తుఫానుల వల్ల కోనపాపపేట గ్రామంలోని కొంత తీర ప్రాంతం సముద్రంలో మునిగింది. చెట్లు కూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.
- తాజాగా మంగళవారం రాత్రి సముద్రంలో కెరటాలు భీకర స్థాయిలో ఎగిసిపడటంతో ఆ గాలుల ధాటికి తీరంలోని పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
- ఈ ఊరిలోని మెయిన్ రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు దాదాపు 200 మీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో మత్స్యకారుల ఇళ్లు ఉండేవి. ఆ ఇళ్లలో దాదాపు 600 మంది నివసించేవారు.
- సముద్ర కోత వల్ల నాలుగు వరుసలలోని దాదాపు 100 ఇళ్లు మాయమయ్యాయి. దాదాపు 400 మంది నిలువనీడ కోల్పోయారు.
- ప్రస్తుతం కోనపాపపేటలో రెండు వరుసల్లో 50 ఇళ్లే మిగిలాయి. వాటిలోని కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
- సముద్రపు జలాల కోత నుంచి కోనపాపపేటను రక్షించేందుకుగానూ వాకలపూడి నుంచి అమీనాబాదు వరకు రక్షణ గోడను నిర్మిస్తామని టీడీపీ సర్కారు చెబుతోంది. ఆ పనులను సాధ్యమైనంత త్వరగా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తమ కుటుంబాలు నిలువ నీడ కోల్పోకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నారు.