Kodela vs Gv : సత్తెనపల్లిలో టీడీపీలో వ‌ర్గ‌పోరు.. పోటాపోటీగా కార్య‌క్ర‌మాలు

సత్తెనపల్లి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ కోటలో యువరాజుగా పల్నాటి పులిగా...

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 11:10 AM IST

సత్తెనపల్లి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ కోటలో యువరాజుగా పల్నాటి పులిగా పిలిచే మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ వన్నె తీసుకు వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొన్ని రాజకీయ కారణాలు, ఒతిళ్ల వల్ల కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారు.దీంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి దిక్కులేకుండా పోయింది. ఆయన కుమారుడు రాజకీయంగా ఎదగాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. టీడీపీలోని ఓ వర్గం ఆయన్ని వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు కూడా తాను సత్తెనపల్లి బరిలో ఉన్నానంటూ గత కొంత కాలంగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం రెండు కత్తులు ఒకే వరలో ఉండలేవు కదా. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఇటు శివరాం వర్గం, అటూ వైవీ వర్గం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

పోటాపోటీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు

అధినేత చంద్రబాబు పిలుపు మేరకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు రెండు వర్గాల మధ్య ఘర్షణకు ఆజ్యం పోసింది. శివరాం, వైవీ ఆంజనేయులు పోటా పోటీగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇంకేముంది మా నాయకుడు ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో భోజనం చేయాలంటూ పేదలపై ప్రతాపం చూపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్టీ పరువును గంగలో కలుపుతున్నారంటూ కొంత మంది టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మా నాయకుడికి సీటంటే మా నాయకుడికి సీటంటూ.. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

గోడమీద పిల్లిలా వైసీపీ

పిల్లి పిల్లి కొట్టుకొని కాకులకు, కోతులకు రొట్టే ముక్కను ఇచ్చినట్లు.. కంచుకోటలాంటి టీడీపీని మరోసారి వైసీపీకి అప్పగించేందుకు టీడీపీ నేతలే కంకణం కట్టుకున్నారని కొంత మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నదమ్ముల్లా మెలగాల్సిన టీడీపీ నేతలు.. బద్ద శత్రువుల్లా పోరాటాలు చేసుకుంటుంటే వైసీపీ నేలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తమ నాయకుడికి ఎర్రి తివాచీని పరిచి మరీ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేలా చేస్తున్నారంటూ చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు సత్తెనపల్లిపై ఫోకస్ పెట్టాలని తెలుగుతమ్ముళ్లు కోరినట్లు సమాచారం.