Site icon HashtagU Telugu

Gudivada Politics : కొడాలి `బూతులే` టీడీపీకి గెలుపు బాట‌..!!

గుడివాడ అంటే కొడాలి నాని అని ఏపీ రాజకీయాలలో పర్యాయ పదంగా నిలిచిపోయింది. కానీ ఒకప్పుడు గుడివాడ తెలుగు దేశం పార్టీకి పెట్టని కోట, స్వర్గీయ ఎన్టీఆర్ ఆ స్థానం నుంచే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా టీడీపీ ఆ స్థానం నుంచి గెలుస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా గుడివాడ స్థానాన్ని గెలవలేకపోయింది. ముఖ్యంగా టీడీపీ స్థాపించినప్పటి నుంచి గుడివాడ ఆ పార్టీ ఖాతాలో పడుతూ వస్తోంది. అయితే గుడివాడలో టీడీపీ గెలుపు వెనుక ఆ నియోజక వర్గంలోని కమ్మ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా టీడీపీ ద్వారానే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు టీడీపీ నుంచే గెలిచారు. కానీ అనూహ్యంగా 2014 ఎన్నికల్లో కొడాలి నాని వైసీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు కేడర్ కూడా భారీగా వైసీపీలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి నాని వెనుక కమ్మ సామాజిక‌వ‌ర్గంలోని ఒక మేజర్ సెక్షన్ తో పాటు ఇతర కులాలు నాని వెనుక నిలబడ్డాయి. దీంతో బలమైన అనుచర గణం ఏర్పాటు చేసుకున్న నాని గుడివాడలో వరుసగా వైసీపీ తరపున రెండో సారి గెలిచారు. ఈ సారి మంత్రి కూడా అయ్యారు. అయితే, ఇతర వైసీపీ నేతల కన్నా కొడాలి నాని టీడీపీ, ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబును విమర్శించడంలో ఓ రెండు ఆకులు ఎక్కువే చదివారు.

టీడీపీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబును, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అసెంబ్లీలోనూ, బయటా ఇష్టానుసారం బూతు పురాణం వినిపిస్తున్నారు. అందుకే నాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గుడివాడలో వాస్తవానికి కమ్మ సామాజిక‌వ‌ర్గం కంటే కాపు, బీసీ కులాల ఓటర్లే ఎక్కువ. నానిపై సరైన అభ్యర్థిని నిలబెట్టి, పోటీ చేస్తే టీడీపీ గుడివాడను కైవసం చేసుకోవచ్చని అధినేత అంచనా వేస్తున్నారు.

తాజాగా నానిపై టీడీపీ ముప్పేట దాడి ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న వెంట ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలోని మేజ‌ర్ భాగం నాని వాడే ప‌ద‌జాలం తప్పేనని అంటున్నారు. అంతేకాదు, నానికి సన్నిహితంగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కింది స్థాయి నేతలు కూడా దూరం జ‌రుగుతున్నార‌ని తెలుస్తోంది. విమర్శలకు బ‌దులుగా బూతులు తిడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణంలోని కొంద‌రు అభిప్రాయం. అందులోనూ సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాళ్ల‌ను ఇష్టం వచ్చినట్లు తిడితే, అదే సామాజిక‌వర్గం నానికి దూరం అయ్యే అవకాశం లేక‌పోలేదు. బూతుల మోతాదు మించిపోవ‌డం కార‌ణంగా కొడాలి త‌న‌కుతానుగా టీడీపీకి గెలుపు చాన్స్ ఇస్తున్నారని ఆయ‌న ఫాలోవ‌ర్స్ కొంద‌రు చెప్పుకోడం గ‌మ‌నార్హం.