Site icon HashtagU Telugu

Nara Lokesh: కార్యకర్తలకు నారా లోకేష్ కీలక సూచనలు.. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి!

Nara Lokesh Gives Guidelines To Tdp Cadre

Nara Lokesh Gives Guidelines To Tdp Cadre

Nara Lokesh: మహానాడు సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌కు పార్టీలో ఒక కీలక పదవిని అప్పగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కార్యకర్తలతో ముడిపడి ఉండే నారా లోకేశ్, ఎక్కడికి వెళ్లినా వారితో సమావేశమయ్యే అవకాశాన్ని మిస్ కావడం లేదు. కార్యకర్తలు పార్టీకి కంచుకోటలు వంటి వారని, వారిని విస్మరించడం ప్రమాదకరమని నేతలకు ఎప్పటికప్పుడు హితవు పలుకుతుంటారు.

నారా లోకేశ్ రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించకముందే కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరంగా శ్రమించారు. 2014 ఎన్నికల ముందు నుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆయన, కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అయన టీమ్ కూడా పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందేలా బీమా సదుపాయాలను ఏర్పాటు చేయడంలో లోకేశ్ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. పార్టీలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే, కార్యకర్తల మనిషిగా, వారి మధ్యనుండే నాయకుడిగా లోకేశ్ నిలిచారు. ఇటీవలి కాలంలో ఆయన కార్యకర్తలకు కొన్ని సూచనలు కూడా చేశారు.

పనులపై స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చిన నారా లోకేశ్

గ్రామస్థాయిలో అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, అక్కడ పనులు ముందుకెళ్లకపోతే మండల స్థాయి నాయకుల సహాయాన్ని తీసుకోవాలని, అవసరమైతే ఎమ్మెల్యే వరకు వెళ్లాలని చెప్పారు. ఎమ్మెల్యే స్పందించకపోతే వెంటనే జిల్లా మంత్రిని కలవాలని, ఆయన కూడా స్పందించకపోతే మంగళగిరి సెంట్రల్ ఆఫీస్‌కు వచ్చి అర్జీ ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు. తాను వ్యక్తిగతంగా ఆ విషయాన్ని పరిశీలించి పరిష్కారం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

“ఇంట్లో కూర్చొని ఉంటె పనులు జరగవు, మొదట మీ సొంత అవసరాల కోసం పోరాటం చేయండి. మీకు సమస్యలే లేని సమయంలో మాత్రమే ఇతరుల పనులకు సహాయపడండి,” అని కార్యకర్తలకు సూచించారు. ఆయన ఈ మాటలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

ఎక్కడ నిరుత్సాహం వొద్దు

ఎక్కడా నిరుత్సాహ పడవద్దని, “అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి, కానీ అమ్మలాంటి పార్టీని ఎప్పటికీ వదల్లద్దు” అంటూ హృదయాన్ని తాకే మాటలతో కార్యకర్తలను చైతన్యపరిచారు.

“మూడో వ్యక్తి చెప్పినదాన్ని నమ్మవద్దు, మీరు స్వయంగా లైవ్‌లో విన్నదే నిజం” అని స్పష్టంగా చెప్పారు. “మన ఎమ్మెల్యే వైసీపీ వాళ్లకి మాత్రమే పనులు చేస్తున్నాడు” అని కొంతమంది చెబుతున్న మాటలు నిజమా కాదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు.

“లోకేశ్ టైమ్ ఇవ్వడం లేదు”, “బాబు కలుసుకోవడం లేదు” అనే వదంతులను నమ్మవద్దని అన్నారు. తాము కూడా మనుషులమే, కొన్ని తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలని, సహకరించాలని కోరారు.