YS Jagan Assets Case: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై కేసులకు సంబంధించి వివరాలను సీబీఐ, ఈడీ సుప్రీం కోర్టుకు పరిశీలన కోసం అందజేశాయి. ఆ నివేదికను పరిశీలించడానికి సుప్రీం కోర్టు సమయం తీసుకున్నది. “తీర్పు ఇవ్వడానికి ముందు ఆ నివేదికను పరిశీలిస్తాం” అని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జనవరి 10 కి వాయిదా పడింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ అఫిడవిట్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఈడీ తమ నివేదికను అఫిడవిట్ రూపంలో సుప్రీం కోర్టుకు దాఖలు చేశాయి. విచారణ జాప్యానికి కారణాలను వివరించే విధంగా ఈ నివేదికలో దర్యాప్తు సంస్థలు వివరణలు ఇచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, కేసులు వేగవంతం చేయాలనీ, అవసరం అయితే వాటిని మరో రాష్ట్రం లేదా ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా, ఆయన వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని, లేకపోతే విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందని మరో పిటిషన్ కూడా దాఖలు చేసారు.
ఈ పిటిషన్లను శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జీ) రాజ్‌కుమార్ భాస్కర్ ఠాక్రే వాదనలు వినిపిస్తూ, గురువారం సాయంత్రం సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ రిపోర్టులను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సంస్థలు సమర్పించిన స్టేటస్ రిపోర్టు కాపీని కోర్టు పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, తమకు కూడా నివేదికను పరిశీలించడానికి కొంత సమయం ఇవ్వాలని కోర్టుకు అభ్యర్థన చేశారు.
సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలియజేయాలని సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. ఈనెల 2న (సోమవారం) విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం సీబీఐ, ఈడీకి కేసుల స్టేటస్ వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కేసుల పురోగతి, ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, మరియు ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను వివరించే అఫిడవిట్ రూపంలో స్టేటస్ రిపోర్టును కోర్టులో సమర్పించాయి. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాతే తీర్పును వెల్లడిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మొత్తం 125 పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడయింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దాఖలైన పిటిషన్లలో దాదాపు 80 శాతం పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన విచారణలో రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు వివరించారు.