CM Chandrababu : ముగిసిన కేబినెట్‌ భేటి.. పలు కీలక నిర్ణయాలు ఇవే..

CM Chandrababu : ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్‌ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Approval of Municipal Laws Amendment Ordinance

Approval of Municipal Laws Amendment Ordinance

AP Cabinet Meeting : సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.

ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్‌ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్‌ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ తన గురువు, అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరిందే తడవుగా.. భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.

మరోవైపు మంత్రులతో చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.. మంత్రులు ప్రోయాక్టివ్ గా పని చేయలని స్పష్టం చేశారు.. మంత్రులు స్పీడ్ పెంచాలి, అదే సమయంలో సమర్ధంగా పని చేయాలంటూ మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు. ఇక నుంచి ప్రతిరోజు ముఖ్యమేనంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రులు కూడా తనతో సమానంగా పని చేయగలగలన్న చంద్రబాబు.. ఇంకా కొందరు నిర్లిప్తంగా ఉన్నారని.. ఇలా ఉంటే పని చేయలేరంటూ మంత్రులకు హితవు చెప్పారు.

Read Also: AP Politics : రేపు మ.12 గంటలకు ఏపీలో ఏం జరగబోతుంది..?

  Last Updated: 23 Oct 2024, 04:07 PM IST