YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం

YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల‌ను నియమించింది.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 03:11 PM IST

YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల‌ను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్సార్ టీపీ పార్టీని స్థాపించిన షర్మిల.. ఇటీవల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో భేటీ అయ్యారు. వారు ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరే టైంలోనే.. ఆమెకు ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం నడిచింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది. ఏపీలో వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు వైఎస్సార్  కుటుంబానికే చెందిన షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించడం ద్వారా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను తన వైపునకు తిప్పుకునేందుకు సమాయత్తం అవుతోంది.

Also Read: CBN – Supreme Court: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌‌.. సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చకచకా పావులు కదుతుపుతున్నాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హవా నడిపించిన కాంగ్రెస్ మాత్రం సైలెంట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకొన్ని నెలల టైమే ఉన్నందున.. చాలామంది నాయకులు పార్టీలు మారడం  మొదలుపెట్టారు. వైఎస్సార్ సీపీ చాలాచోట్ల కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆయా చోట్ల సీట్లు దక్కనివారు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇక కొత్తగా పాలిటిక్స్‌లోకి వస్తున్నవారు కూడా టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేనలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఎంతగా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం(AP Congress) కసరత్తును మొదలుపెట్టింది.  ఈక్రమంలోనే ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించింది.  షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌కు కొంత జోష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ఉన్న పేరు.. గతంలో ఏపీలో పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్లుగా మారే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి పార్టీలు మారుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీని అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల.. జనంతో పార్టీకి కనెక్టివిటీని పెంచడం అనే అతిపెద్ద టాస్క్‌ను తొలుత పూర్తి చేయాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్‌పై సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ పెంచేలా ప్రజలతో కాంగ్రెస్ శ్రేణులను మమేకం చేయించాలి. అలా అయితేనే పార్టీలు మారేందుకు రెడీ అవుతున్న నాయకులు.. కాంగ్రెస్ వైపు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.