విజయవాడ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు కేశినేని నాని (Kesineni Nani). 2024 ఎన్నికల ముందు వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నప్పటికీ, ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, మళ్లీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నందిగామ, మైలవరం వంటి ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ, రాజకీయంగా తిరిగి బలంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎవరితో కలుస్తారు? ఏ పార్టీలోకి వెళ్లతారు? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
30 Thousand Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు!
కేశినేని నాని తన రాజకీయ ప్రయాణాన్ని టీడీపీతో ప్రారంభించి, విజయవాడ ఎంపీగా గెలిచారు. కానీ టీడీపీ అధిష్టానంతో విభేదాలు పెరిగి, పార్టీలో అసంతృప్తిగా మారారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ వ్యతిరేకంగా ధోరణి అవలంభించడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని చిన్నిని ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నదమ్ముల మధ్య రాజకీయపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. చివరికి 2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా గెలవగా, కేశినేని నాని ఓటమిపాలయ్యారు. 2024 ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, ఇప్పుడు తిరిగి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అనుచరులకు రాజకీయంగా యాక్టివ్‌గా ఉండాలని సూచిస్తూ, తన రీఎంట్రీపై పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు. అయితే, ఆయనకు టీడీపీలో మళ్లీ చోటు దొరకడం కష్టమే. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
కేశినేని నానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఆలోచనలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ కూడా కేశినేని చేరికపై హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన కుమార్తె కేశినేని శ్వేతకు మంచి రాజకీయ భవిష్యత్తు కల్పించేందుకు కూడా బీజేపీనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేశినేని నాని బీజేపీలో చేరితే.. విజయవాడ రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఉండగా, ఆయన అన్న నాని బీజేపీలో చేరితే, ఓటింగ్ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశముంది. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నప్పటికీ, కేశినేని నాని చేరికపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.