విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani ) మరోసారి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ (Re Entry Into Politics) ఇస్తారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు, సన్నిహితులతో సమావేశాలు నిర్వహించడం, కొన్ని మీడియా సంస్థలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు ప్రచారం చేయడం ఇందుకు కారణమయ్యాయి. అయితే ఈ వార్తలపై స్వయంగా స్పందించిన కేశినేని నాని, తన పొలిటికల్ రీ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. గతంలో తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. 2024 జూన్ 10న తాను అధికారికంగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించానని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎప్పటికీ కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ICE: ఐస్ తో ముఖానికి మర్దనా చేస్తే అందం పెరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
అంతేకాదు తన సేవ ఏ రాజకీయ పార్టీకి లేదా పదవికి పరిమితం కాదని, సమాజ సేవ చేయడం తన నిజమైన లక్ష్యమని కేశినేని నాని తెలిపారు. విజయవాడ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తానని, తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి వస్తున్న అపోహలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల నుంచి విరమించినా, తన నిబద్ధత ప్రజల సంక్షేమం పట్ల మాత్రం ఎప్పటికీ మారదని స్పష్టంగా చెప్పారు.
కేశినేని నాని రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే… ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2013లో తెలుగుదేశం పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. కానీ 2019లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. చివరికి 2024లో వైఎస్సార్‌సీపీలో చేరి, ఎంపీగా పోటీచేశారు. అయితే తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి అనంతరం.. కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆయన భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ తన తాజా ప్రకటన ద్వారా తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి జరుగుతున్న ప్రచారం పై క్లారిటీ వచ్చింది.