KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ఒక్కో వర్గానికి ఒక్కో భవన్ ను కేటాయించిన విషయం తెలిసిందే

  • Written By:
  • Updated On - June 26, 2023 / 03:43 PM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ వరుసగా ప్రజలపై హామీలు గుప్పిస్తున్నారు. ఓట్లు దండుకునేందుకు అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అన్ని వర్గాలను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ఒక్కో వర్గానికి ఒక్కో భవన్ ను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కాపుల కోసం కాపు భవన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద తతంగమే ఉందట. తెలంగాణలోని ఆంధ్రులను తనవైపు తిప్పుకొని రాజకీయ ప్రయోజనం పొందాలని భావించడం మరో కారణమైతే,  కాపు ఓట్లను చిల్చీ జగన్ కు రెండోసారి అధికారం కట్టబెట్టేందుకే వ్యూహాలు రచిస్తుండటం మరో కారణం. రాజకీయ విమర్శకులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కాపు ఓట్లు చీల్చడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ఒంటరి పోరుకు ప్రభావితం చేసేలా ఎత్తుగడలు వేస్తున్నాడని, తద్వారా వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల జగన్ కు లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్ వేదికగా కాపు పెద్దలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో స్తిరపడ్డ ఆంధ్ర ప్రాంత వాసులు సిఎం కే సిఆర్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. తోట నేతృత్వంలో జంట నగరాల్లో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు ఐ ఏ ఎస్ ,ఐ పి ఎస్,ఐ ఆర్ ఎస్ ఉన్నతాధికారులు ధికారులు,పారిశ్రామిక వేత్తల బృందం రాజకీయాలకతీతంగా సిఎం కే సి ఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ఐదు ఎకరాల భూమిని మంజూరుచేసి , కాపు భవన నిర్మాణానికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఎం కే సి ఆర్ కు కాపు ఉన్నతాధికారుల బృందం కలసి వినతిపత్రం అందించారు .

సిఎం కేసిఆర్ సానుకూలంగా స్పందిస్తూ కాపు భవన నిర్మాణానికి తన వంతుగా సంపూర్ణ సహకారం తప్పక అందిస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, రామ్ మోహన్, లక్ష్మీకాంతం,గోపాలకృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారులు తోట మురళీకృష్ణ , విశ్రాంత ఐఆర్ఎస్ అధికారులు పీవీ రావు , రంగిశెట్టి మంగబాబు, చింతల పార్థసారథి, పారిశ్రామిక వేత్తలు మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, టిసి అశోక్, ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు , ఎంహెచ్ రావు , శ్రీహరి , చంద్రశేఖర్ మరియు ఇతర కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read: Pregnancy: సంగీతంతో పుట్టబొయే బిడ్డకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు