Site icon HashtagU Telugu

AP BRS : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! ఆ మూడు పార్టీల‌ పొత్తు?

AP BRS

Ycs, Brs

ఏపీలోకి బీఆర్ఎస్(BRS) ఎంట్రీ ఇవ్వ‌నుంది. పార్టీ కార్యాల‌యాన్ని విజ‌య‌వాడ కేంద్రంగా ఓపెన్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18,19 తేదీల్లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఏపీకి వెళ్ల‌నున్నారు. సుమారు 800 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో పార్టీ ఆఫీస్ ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే, ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) పార్టీని విస్త‌రింప చేయ‌డానికి కేసీఆర్ సిద్ధం అయ్యారు. అయితే, ఆయ‌న ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ‌తారా? వైసీపీ(YCP)తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి బీఆర్ఎస్ ను దింపుతారా? అనేది హాట్ టాపిక్.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య సఖ్య‌త ఉంది. వాళ్లిద్ద‌రూ క‌లిసి రాజ‌కీయాల‌ను చేస్తున్నారు. ఏపీ ఆస్తుల‌ను ఉదారంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డంలోనూ జ‌గన్మోహ‌న్ రెడ్డి స‌హ‌కారం అందించారు. వాళ్లిద్ద‌రి టార్గెట్ 2019 ఎన్నిక‌ల ముందు నుంచి చంద్ర‌బాబే. ఇప్పుడు ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న బీఆర్ఎస్ పార్టీ వైసీపీ(YCP)తో క‌లిసి పోటీ చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. అటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటు వైసీపీ(YCP) చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌హ‌జ మిత్రునిగా ఎంఐఎం అధినేత ఓవైసీ ఉన్నారు. 2019 ఎన్నిక‌ల్లో కేసీఆర్, ఓవైసీ ఇద్ద‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపు కోసం ప‌నిచేశారు. రాబోవు ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉండ‌డానికి అవ‌కాశం ఉంది.

ఎన్నిక‌ల‌కు ఏక్ష‌ణ‌మైనా

ఎన్నిక‌ల‌కు ఏక్ష‌ణ‌మైనా వెళ్ల‌డానికి కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన స‌న్నాహాల‌ను చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు స‌మీక్ష‌ల‌ను నిర్వ‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈనెల 14వ తేదీన కీల‌క స‌మావేశాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో నిర్వ‌హించ‌బోతున్నారు. క‌నీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని చెప్ప‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. గ్రాఫ్ ప‌డిన పోయిన ఎమ్మెల్యేల‌ను నిర్మొహ‌మాటంగా దూరంగా పెట్ట‌డానికి ఆయ‌న ఏ మాత్రం వెనక‌డుగు వేయ‌డంలేదు. మ‌రో వైపు కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతున్నారు. బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తూ బీఆర్ఎస్ పార్టీ. త‌ర‌పున ఈసారి ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల మీద వ్య‌తిరేక‌త పెరుగుతోంది. మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ ప‌లు ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ద‌ళిత బంధు మాదిరిగా బీసీల‌కు మ‌రో బంధును ఇస్తాన‌ని చెబుతున్నారు. సేమ్ టూ సేమ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా బీసీ ఆత్మీయ సమ్మేళ‌నాల‌ను పెట్టారు. అన్న‌ద‌మ్ముల మాదిరిగా రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాల‌ను న‌డుపుతోన్న కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని తెలుస్తోంది. అందుకోసం స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయం కావ‌డంతో పొత్తుల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం, కాంగ్రెస్ క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే, టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ ఒక కూట‌మిగా రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల‌కు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఉత్త‌రాంధ్ర‌ను కేంద్రంగా

ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ రాణించడానికి ఉత్త‌రాంధ్ర‌ను కేంద్రంగా చేసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన లీడ‌ర్ల‌తో ట‌చ్ లో ఉన్నారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర మీద ఎక్కువ‌గా ఆయ‌న దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. కాపు, బీసీ లీడ‌ర్ల‌ను బీఆర్ఎస్ పార్టీలోకి ఎక్కువ‌గా ఆహ్వానించ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని వినికిడి. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలియ‌కుండా బీఆర్ఎస్ ఎంట్రీ ఏపీలోకి ఇస్తుంద‌ని ఎవ‌రూ న‌మ్మ‌రు. ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని ఏమి చేయ‌బోతున్నారు అనేది ఆస‌క్తిక‌ర అంశం.