Site icon HashtagU Telugu

AP Govt: ఉద్యోగాల భర్తీలో ‘ఏపీ సర్కార్’ రూటేంటి?

cm jagan

80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగుల ముఖంలో నవ్వులు పూశాయి. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఉద్యోగాల్లో చేరుతామా అని ఆశగా ఎదురుచూసినవాళ్ల నెత్తిన పాలు పోశారు కేసీఆర్. అందుకే ఆయన చిత్రపటాలకు తెలంగాణ అంతటా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడివరకు స్టోరీ ఓకే. కానీ ఏపీ రాజకీయాల్లో ఇది ప్రకంపనలకు కారణమైంది.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిననాటి నుంచి అప్పుల ఊబిలో ఉంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువుగా కనిపిస్తోంది. దీంతో ఉద్యోగాల భర్తీ కనాకష్టంగా మారింది. ఉన్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి ప్రయాస పడుతున్న సర్కారుకు.. కొత్త ఉద్యోగాలను భర్తీ చేసి వారికి జీతాలు ఇవ్వడమంటే మాటలు కాదు. ఎందుకంటే రోజూ ప్రభుత్వ బండి నడపాలన్నా అప్పుల పై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఏపీ ఉంది.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీని నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారిపోయింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను ఇచ్చే స్థితిలో లేదు. ఇప్పుడు అయినా తెలంగాణలో ఉద్యోగాల ప్రకటన తరువాత ఏపీ లో కూడా అలాంటి ప్రకటన వస్తుందా అని నిరుద్యోగుల్లో ఆశ మొదలైంది. మరి పరిస్థితి అలా ఉందా? రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య చాలా అంశాల్లో పోటీ ఉంది. అంటే పీఆర్సీ ప్రకటించడం, ఉద్యోగులకు పని విషయంలో వెసులుబాట్లు ఇవ్వడం, రాష్ట్రంలో వివిధ వర్గాలకు తాయిలాలు ఇవ్వడం వీటన్నింటిలోనూ పోటీ పడ్డారు. జల వివాదాలూ మామూలే. కలిసికట్టుగా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం అనుకున్నారు. మరి ఇన్ని చేసినవాళ్లు ఇప్పుడు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకు ఏపీ ముందడుగు వేయడం లేదన్న ప్రశ్న వస్తోంది. వాలంటీర్లను పెద్ద ఎత్తున తీసుకోవడం తప్ప ఆ స్థాయిలో ఉపాధిని కల్పించలేదు. వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు. అందుకే ఏపీ సర్కార్ కొత్త కొలువులు ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.