AP,TS-2024: భ‌స్మాసుర క‌థ‌,గురుశిష్యుల క‌థాక‌మామీషు!

ఆంధ్రా సంస్కృతి, సంప్ర‌దాయాలు, న‌డ‌వ‌డిక‌, యాస‌, భాష త‌దితరాల‌కు తెలంగాణ డిఫ‌రెంట్‌. ఆ విష‌యాన్ని ప్ర‌త్యేక ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ప‌దేప‌దే చెప్పిన మాట‌.

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 04:59 PM IST

ఆంధ్రా సంస్కృతి, సంప్ర‌దాయాలు, న‌డ‌వ‌డిక‌, యాస‌, భాష త‌దితరాల‌కు తెలంగాణ డిఫ‌రెంట్‌. ఆ విష‌యాన్ని ప్ర‌త్యేక ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ప‌దేప‌దే చెప్పిన మాట‌. తెలంగాణ సంస్కృతి మీద సినిమాల రూపంలో ఆంధ్రా సాహిత్యం దాడి చేసింద‌ని ఎన్నోసార్లు చెప్పారు. ఆంధ్రా వాళ్ల మైండ్ సెట్ డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని ధ్వ‌జ‌మెత్తిన సంద‌ర్భాలు అనేకం. ఆయ‌న స్డ‌డీ చేసిన‌ట్టు ఏపీ ప్ర‌జ‌ల మైండ్ ను టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు స్ట‌డీ చేయ‌లేక‌పోయారు. ఫలితంగా 2019 ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల‌కు ఆయ‌న పార్టీ ప‌రిమితం అయింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఆయ‌న సామ‌ర్థ్యం ఏమిటో దేశంలోని జాతీయ పార్టీల అగ్ర‌నేత‌ల‌కు తెలుసు. విజ‌న్ 2020 ఇచ్చిన ఫ‌లితాలను తెలంగాణ‌లో చూస్తున్నాం. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను 2019 ఎన్నిక‌ల్లో ఏపీ ఓట‌ర్లు ఆద‌రించలేదు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత అనాద‌గా ఉన్న ఏపీని ప్ర‌పంచ పటంలో నిల‌పాల‌ని ఆయ‌న క‌ల‌లు క‌న్నారు. విజ‌న్ 2029కు డిజైన్ చేశారు. అంతేకాదు, 2050 నాటికి ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1గా నిలప‌డానికి ప్లాన్ చేశారు. ఆ దిశ‌గా పునాదులు వేసి 2019 ఎన్నిక‌లకు వెళ్లారు. ప్ర‌జ‌ల ముందు విజ‌న్ ను ఆవిష్క‌రించారు. న‌మ్మండ‌ని `వంగివంగి` దండం పెట్టారు. ఒక వేళ ఈ ఎన్నిక‌ల్లో పొర‌బాటు చేస్తే ఏపీ అభివృద్ధి నిలిచిపోతుంద‌ని ఓట‌ర్ల‌కు విడ‌మ‌ర‌చి చెప్పారు. పోల‌వ‌రం, అమ‌రావ‌తి నిర్మాణం, పారిశ్రామి అభివృద్ధి, విశాఖ ఐటీ హ‌బ్, రాయ‌ల‌సీమ హార్డ్ వేర్ హ‌బ్ త‌దిత‌రాల‌న్నీ నిలిచిపోతాయ‌ని అప్ర‌మ‌త్తం చేశారు. కానీ, చంద్ర‌బాబును కాద‌ని ఓట‌ర్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు మొగ్గారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇంచుమించు చంద్ర‌బాబు మాదిరిగానే 2018 ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు చెప్పారు. బంగారు తెలంగాణ దిశ‌గా అడుగులు ప‌డ్డాయ‌ని, ఈ ద‌శ‌లో ఏమ‌ర‌పాటుగా ఉంటే ఆంధ్రోళ్లు వ‌స్తార‌ని ఓట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత 24 గంట‌ల విద్యుత్‌, మంచినీళ్లు, ఇత‌రత్రా అభివృద్ధికి బాట‌లు వేశామ‌ని వివ‌రించారు. పొర‌బాటును ఇత‌ర పార్టీల‌కు ఓటేస్తే కాళేశ్వ‌రంతో పాటు ప‌లు ప్రాజెక్టులు నిలిచిపోతాయ‌ని, మ‌ళ్లీ 20 ఏళ్లు వెనుక్కు వెళతామ‌ని విడ‌మ‌ర‌చి చెప్పారు. ఆయ‌న మాట‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. `ఎడ్డోడైనా మ‌డ్డోడైనా మ‌నోడే` ఉండాల‌ని కేసీఆర్ ప‌దేప‌దే తెలంగాణ ఓట‌ర్ల‌కు నూరిపోశారు. కులాలు, మ‌తాలు, ప్రాంతానికి అతీతంగా ఓట్లు వేసి బంగారు తెలంగాణ నినాదం దిశ‌గా ఓట‌ర్లు నిలిచారు. ఇక అక్క‌డ నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం ఏపీని కేసీఆర్ టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

రెండోసారి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత వ్యూహాత్మ‌కంగా ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఆనాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్ని ర‌కాలుగా మ‌ద్ధ‌తు ప‌లికారు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించ‌డానికి ఏపీకి వెళ్ల‌డానికి కూడా సిద్దం అయ్యారు. సామాజిక‌వ‌ర్గాల వారీగా తెలంగాణ లీడ‌ర్ల‌ను ఏపీకి పంపారు. తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండే బీసీ ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబుకు దూరం చేయ‌డానికి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ను రంగంలోకి దింపారు. ముస్లిం మైనార్టీల ఓట‌ర్ల మ‌న‌సు మార్చ‌డానికి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ అనుచ‌రుల‌ను దూత‌లుగా ఏపీకి పంపారు. హైద‌రాబాద్ కేంద్రంగా చేసుకుని సాంకేతిక‌, ఆర్థిక అంశాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సంపూర్ణంగా కేసీఆర్ అందించారు. రాజ‌కీయ మేరుప‌ర్వ‌తంలాంటి చంద్ర‌బాబును గ‌ద్దె దించ‌గ‌లిగారు. ఫలితంగా అమ‌రావ‌తి ప్రాజెక్టు మూల‌న‌ప‌డింది. పోల‌వ‌రం ఆగిపోయింది. విశాఖ ఐటీ హ‌బ్ క‌ల చెదిరిపోయింది. రాయ‌ల‌సీమ హార్డ్ వేర్ కేంద్రం అంద‌ని ద్రాక్ష‌గా మారింది.

ఏపీ పాల‌న‌, అభివృద్ధి, ఆర్థిక అంశాలు గంద‌ర‌గోళం కావ‌డంతో 2019 నుంచి తెలంగాణ ప్ర‌గ‌తి ఊపందుకుంది. పున‌ర్విభజ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 10, 11 కింద ఉన్న ఆస్తుల‌ను క్ర‌మంగా కేసీఆర్ లాగేసుకుంటున్నారు. సుమారు 6ల‌క్ష‌ల కోట్ల విలువైన ఉమ్మ‌డి ఆస్తులు తెలంగాణ‌లో ఉన్నాయి. వాటిలో వాటా ఏపీకి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. 2024 నాటికి ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ గడువు కూడా ముగుస్తుంది. దీంతో ఏపీ ఆస్తులు ఇక తెలంగాణ ప‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంది. వాటి మీద పోరాడే ధైర్యం ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చేయ‌ర‌ని స‌ర్వ‌త్రా తెలిసిన అంశ‌మే. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ బంధం బ‌లంగా ఉంది. అందుకే, ఇప్ప‌టికైనా అర్థం చేసుకోండ‌ని ఏపీ ఓట‌ర్ల‌కు చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇవే చివ‌రి ఎన్నిక‌లు, 2024లో కూడా పొర‌బాటు చేస్తే ఇక రాష్ట్రాన్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు అనుకున్నంత‌గా రావ‌డంలేదు. దీంతో విసిగిపోయిన చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌లు `నాకు కాదు, మీకే చివ‌రివి`అంటూ పెద్ద మ‌నిషిగా హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

కుల‌, మ‌త, ప్రాంతాల వారీగా ఆలోచించే ఏపీ ఓట‌ర్ల మైండ్ సెట్ వేర‌ని కేసీఆర్ గ్ర‌హించారు. ఈసారి కూడా అదే మంత్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావ‌డానికి తెర‌వెనుక పావులు క‌దుపుతున్నార‌ని టాక్‌. తెలంగాణ ఓట‌ర్లు మైండ్ ను `సెంటిమెంట్` తో క‌ట్టేసుకున్న కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌స్త‌త్వాన్ని కూడా చ‌దివేశారు. కానీ, విజ‌న‌రీగా పేరున్న చంద్ర‌బాబు మాత్రం ఏపీ ప్ర‌జ‌ల్ని మెప్పించ‌లేక విసిగిపోతున్నారు `ఇదేం ఖ‌ర్మ..మ‌న రాష్ట్రానికి` అంటూ ఓట‌ర్ల మ‌ధ్య‌కు వెళుతూ భ‌స్మాసుర క‌థ‌ను వినిపిస్తున్నారు. ఈసారైనా చంద్ర‌బాబు విజ‌న్, ఆయ‌న ఆలోచ‌న ఏపీ ఓట‌ర్ల‌కు ఎక్కుతుందా? తెలంగాణ నుంచి కేసీఆర్ పంపే దూత‌ల‌కు జై కొడ‌తారా? అనేది 2024 ఎన్నిక‌ల్లో తేల‌నుంది.