Site icon HashtagU Telugu

Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

Srikakulam Stampede

Srikakulam Stampede

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ్యం ఐదు వేలు మాత్రమేనని.. కానీ ఏకాదశి పర్వదినం కావటంతో 25 వేల మంది వచ్చారని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేలు లేదా మూడు వేల మంది భక్తులు వస్తుంటారని.. కానీ ఈ రోజు అనూహ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని హరిముకుంద్ పండా చెప్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని.. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఐదారువేల మంది భక్తులు వస్తారని అనుకున్నామని.. ఇలా జరుగుతుందని ఊహించలేదంటున్నారు. తొక్కిసలాట ఘటన అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ.. హరిముకుంద్ పండాతో మాట్లాడారు.

కాశీబుగ్గ తొక్కిసలాట.. దేవాదాయ శాఖ ప్రకటన
మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకూ పది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం .. ఏపీ దేవాదాయశాఖ పరిధిలోకి రాదన్న ఆనం రామనారాయణరెడ్డి.. ప్రైవేట్ ఆలయమని చెప్పారు. ప్రైవేట్ దేవాలయాల్లో భక్తుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నామన్నారు.

కానీ ప్రైవేట్ ఆలయాలు తమకు సమాచారం అందించడం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం సామర్థ్యం కేవలం 5 వేలు మాత్రమేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. అయితే కార్తీక ఏకాదశి పర్వదినం కావటంతో సామర్థ్యానికి మించి 25 వేల మంది వరకూ భక్తులు ఆలయానికి వచ్చారని.. దీంతోనే తొక్కిసలాట జరిగిందని మంత్రి వివరించారు.

మరోవైపు కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విచారకరమన్న ప్రధాని.. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే తన ఆలోచనలు ఉన్నాయన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవైపు కార్తీక ఏకాదశి, శనివారం కావటంతో ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగ్గా.. పది మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో 20 మంది వరకూ గాయపడ్డారు.

Exit mobile version