Site icon HashtagU Telugu

Karumuri Venkata Reddy : వైసీపీ నేత అరెస్ట్..కారణం ఆ వ్యాఖ్యలు చేయడమే !!

Ysrcp Karumuri Venkata Redd

Ysrcp Karumuri Venkata Redd

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేయడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. కూకట్‌పల్లి ప్రాంతంలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వెంకట్‌రెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు ఉదయం అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. గత కొంతకాలంగా ఆయనపై నమోదైన పలు కేసులను పరిశీలించేందుకు, అలాగే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని కీలక ఘటనల నేపధ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీశ్‌కుమార్ అనుమానాస్పద మృతిపై వచ్చిన ఆరోపణలు ఈ ఘటనను మరింత సున్నితంగా మార్చాయి.

Iconic Tower : వైజాగ్ లో 50 అంతస్తుల ‘ఐకానిక్ టవర్’

సతీశ్‌కుమార్ మృతదేహం అనంతపురం తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద కనపడటం, ఆయన హత్య చేయబడ్డారని పోలీసులు భావించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతుండగా, కారుమూరు వెంకట్‌రెడ్డి ఇటీవల ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయంటూ టీడీపీ నేత ప్రసాదనాయుడు ఫిర్యాదు చేయడంతో తాడిపత్రి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వెంకట్‌రెడ్డిని మొబైల్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి హైదరాబాద్‌లో గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో కర్నూలు ట్రావెల్స్ బస్సు ప్రమాదం తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో చేసిన వ్యాఖ్యలపై కూడా కేసులు నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలో శ్యామల, పూడి శ్రీహరి తదితరులను ఇప్పటికే పోలీసులు విచారించారు. ఇప్పుడు కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసులన్నింటికీ కొత్త మలుపు తిరిగే అవకాశముంది. ఆయనను సతీశ్‌కుమార్ మరణంపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ చేశారా? లేక బస్సు ప్రమాద వ్యాఖ్యల కేసులోనా? అన్న అంశంపై పోలీసులు త్వరలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా, ఈ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముంది.

Exit mobile version